కోలుకున్నా… భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి
వడ్డీ రేట్ల పెంపు భయం, ఒమైక్రాన్ భయం మధ్య స్టాక్‌మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌కు యూరో మార్కెట్లు కాస్త ఉపశమనం కల్గించాయి. అలాగే విదేశీ ఇన్వెస్టర్లు కూడా మిడ్ సెషన్ లాభాలు స్వీకరించడంతో దిగువస్థాయి నుంచి నిఫ్టి కోలుకుంది. ఇవాళ ఉదయం 16,840ని తాకిన నిఫ్టి సరిగ్గా మిడ్ సెషన్ సమయానికి 16410 పాయింట్లను తాకింది. దాదాపు అన్ని రకాల కీలక మద్దతు స్థాయిలను కోల్పోయింది. ఉదయాన్ని చాలా మంది విశ్లేషకులు సాధారణ ఇన్వెస్టర్లను మార్కెట్‌కు దూరంగా ఉండమని సలహా ఇచ్చారు.దీంతో నిఫ్టికి ఎక్కడా మద్దతు దక్కలేదు. విదేశీ ఇన్వెస్టర్లే లాభాల స్వీకరించడంతో కనిష్ఠ స్థాయి నుంచి 120 పాయింట్లు కోలుకుని 16,614 వద్ద ముగిసింది. అయినా క్రితం ముగింపు పోలిస్తే నిఫ్టి 371 పాయింట్ల నష్టంతో ముగిసింది.నిఫ్టి 2.63 శాతం నష్టపోతే… మిడ్ క్యాప్ నిఫ్టి ఏకంగా 4.3 శాతం నష్టంతో ముగిసింది. ఇవాళ నిఫ్టిని ముంచిన వాటిలో బ్యాంక్ నిఫ్టి ముందుంది. ఇతర సూచీలన్నీ మూడు శాతంపైగా నష్టపోయాయి. కేవలం సిప్లా, హెచ్‌యూఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి.