5శాతం క్షీణించిన బిట్ కాయిన్
అంతర్జాతీయ మార్కెట్లో బిట్ కాయిన్… మళ్ళీ 50,000 డాలర్ల దిగువకు వచ్చేసింది. గత 24 గంటల్లో బిట్ కాయిన్ 5 శాతం క్షీణించి 49,075 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో బిట్‌కాయిన్‌లో 18.7 కోట్ల డాలర్ల విలువైన లాంగ్ పొజిషన్స్‌ను ట్రేడర్స్ లిక్విడేట్ చేశారు. ఇతర క్రిప్టో కరెన్సీలతో పోలిస్తే బిట్ కాయిన్ అత్యధికంగా నష్టపోయింది. మిగిలినవి స్వల్పంగా నష్టపోగా, మరికొన్ని లాభాల్లో ఉన్నాయి. నిన్న బిట్ కాయిన్ 51,000 డాలర్ల పైన ట్రేడైంది. మార్కెట్లో రెండో అతి పెద్ద క్రిప్టోకరెన్సీ అయిన ఏథెర్ కూడా మూడు శాతం తగ్గింది. దిగువ స్థాయిలోనూ మద్దతు అందకపోవడం వల్ల భారీగా క్షీణిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
భారత్‌లో స్థిరంగా…
అమెరికా మార్కెట్లో డాలర్ ఇండెక్స్ 0.33 శాతం వరకు క్షీణించడమే గాక… మన దేశంలో బిట్ కాయిన్ చాలా డిస్కౌంట్‌తో ట్రేడవుతుంది. ఈ కారణాల రీత్యా మన దేశంలో బిట్ కాయిన్ కేవలం 2.28 శాతం నష్టంతో రూ. 40,10,000 వద్ద ట్రేడవుతోంది. ఇక ఏథర్ మన మార్కెట్లో 0.42 శాతం లాభంతో రూ. 3,46,010 వద్ద ట్రేడవుతోంది. లైట్ కాయిన్ మాత్రం 2.55 శాతం లాభంతో రూ.13,388 వద్ద ట్రేడవుతోంది.