For Money

Business News

అబుదాబిలో రిలయన్స్‌ పెట్టుబడులు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అబుదాబి కెమికల్స్‌ డెరివేటివ్స్‌ కంపెనీ ఆర్‌ఎస్‌సీ లిమిటెడ్‌ (టాజిజ్‌)తో కలిసి సంయుక్త సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దాదాపు 200 కోట్ల డాలర్ల (సుమారు రూ.15,000 కోట్లు) పెట్టుబడితో పెట్రోరసాయనాల ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థలైన అబుదాబి నేషనల్‌ ఆయిల్‌ కంపెనీ (ఏడీఎన్‌ఓసీ), ఏడీక్యూలు కలిసి టాజిజ్‌ను నెలకొల్పాయి. రువాయిస్‌లోని టాజిజ్‌ ఇండస్ట్రియల్‌ కెమికల్స్‌ జోన్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ కొత్త సంయుక్త సంస్థ ఏడాదికి 9.40 లక్షల టన్నుల క్లోర్‌-ఆల్కలీ, 11 లక్షల టన్నుల ఇథిలీన్‌ డైక్లోరైడ్‌ (ఈడీసీ), 3.60 లక్షల టన్నుల పాలీవినైల్‌ క్లోరైడ్‌ (పీవీసీ) ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, నిర్వహించనుంది. 2025 నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తున్నారు.