కరోనాతో షేర్ మార్కెట్ కకావికలం
కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తోంది. ఉదయం ఆసియా దేశాల్లో ప్రారంభం నుంచే షేర్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ముఖ్యంగా జపాన్, హాంగ్ కాంగ్ పతనంతో భారత మార్కెట్లో ఓపెనింగ్‌లోనే డీలా పడిపోయింది. రోజంతా నష్టాల్లో ఉన్నా… మిడ్ సెషన్ తరవాత యూరో మార్కెట్ల అమ్మకాలు భారత మార్కెట్‌ను అయోమయంలో పడేశాయి. ఏకంగా మూడు శాతం పైగా యూరో మార్కెట్లు క్షీణించడంతో… మన మార్కెట్లో అమ్మకాలు మరింత పెరిగాయి. వారాంతం కావడం, డిసెంబర్ సిరీస్‌లో డెరివేటివ్స్ ప్రారంభం కావడంతో చివర్లో నిఫ్టి 17,000 స్థాయిని కూడా కోల్పోయింది.16,985 నుంచి స్వల్పంగా పెరిగి 17,026 వద్ద ముగిసింది. కేవలం సెంటిమెంట్ కోసం నిఫ్టి 17000 పాయింట్ల పైన ముగిసింది. ఫార్మా రంగానికి చెందిన సిప్లా,డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, దివీస్ ల్యాబ్‌తో పాటు నెస్లే ఇండియా కంపెనీల షేర్లు లాభాల్లో క్లోజ్ కాగా, మిగిలిన 46 షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టి కంటే మిడ్ క్యాప్, బ్యాంక్ నిఫ్టిలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. బ్యాంక్ నిఫ్టి 3.6 శాతం క్షీణించగా, మిడ్ క్యాప్ నిఫ్టి 3.8 శాతంపైగా నష్టపోయింది.