కనీస మద్దతు ధర ఇస్తే… దేశం దివాళా తీస్తుంది
23 పంటలకు కనీస మద్దతు ధర (MSP)ని ప్రభుత్వం ప్రకటించేస్తే దేశం రెండేళ్ళలో దివాలా తీస్తుందని కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు అనిల్ ఘన్వత్ అన్నారు. షేత్కారీ సంఘటన్ నాయకుడైన ఘన్వత్.. మీడియాతో మాట్లాడుతూ.. అన్ని పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తే.. దేశంలో అశాంతికి దారి తీస్తుందని హెచ్చరించారు. ప్రతిరోజూ దేశంలో ఎక్కడో ఒక చోట రైతు ఉద్యమం ఉంటుందన్నారు. ప్రతి రైతు తాను పండించిన పంటకు కనీస మద్దతు ధర కావాలని డిమాండ్ చేస్తారని అన్నారు. ప్రపంచంలో పంటలకు సబ్సిడీలు ఇచ్చే విధానం ఉందని, అన్ని పంటలకు ఎంఎస్పీ ఇచ్చే విధానం ఎక్కడా లేదని ఆయన అన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేయడం కూడా ప్రభుత్వానికి తలకు మించిన భారం అవుతుందని అన్నారు. ధరలు మరీ అధికంగా పెరిగినపుడు జోక్యం చేసుకోవడం వినా… వ్యవసాయ ఉత్పత్తుల జోలికి ప్రభుత్వం పోకపోవడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు.