కేజీ బేసిన్లో రూ.600 కోట్ల పెట్టుబడి
కృష్ణా- గోదావరి (కేజీ) బేసిన్లోని ఆఫ్షోర్ క్షేత్రంలో చమురు, సహజవాయువు వెలికి తీసేందుకు రూ.600 కోట్ల పెట్టుబడులు పెట్టాలని ఆయిల్ ఇండియా నిర్ణయించింది. గతంలో ఈ క్షేత్రం ఓఎన్జీసీ ఆధీనంలో ఉండేది. 2019లో ఈ క్షేత్రాన్ని ఆయిల్ ఇండియా దక్కించుకుంది. 94 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఈ క్షేత్రం విస్తరించి ఉంది. ఇక్కడ 20 లక్షల టన్నుల ముడి చమురు, 500 కోట్ల క్యూబిక్ మీటర్ల సహజవాయువు నిల్వలు ఉండొచ్చన్నది ఆయిల్ ఇండియా అంచనా. 11 బావులను తవ్వాలని కంపెనీ అనుకుంటోంది. ఈ బావుల్లో ఉత్పత్తి ప్రారంభమైతే, సరఫరా కోసం సముద్ర అంతర్భాగంలో పైపులు కూడా వేసి, రెండేళ్లలో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాలని అనుకుంటోంది.