చిక్కుల్లో ఇండస్ ఇండ్ బ్యాంక్?
మరో ప్రైవేట్ బ్యాంక్ ఇపుడు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈసారి హిందూజా గ్రూప్‌నకు చెందిన ఇండస్ ఇండ్ బ్యాంక్‌కు చెందిన అనుబంధ సంస్థ ఈ ఆరోపణలు ఎదుర్కొవడం విశేషం. తాజా ఆరోపణలు ఏమిటంటే….రుణాల మంజూరులో గోల్‌మాల్ చేశారని. ఎస్‌కేఎస్ మైక్రో ఫైనాన్స్ కంపెనీ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందే. ఆకుల విక్రమ్ ప్రారంభించిన ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విమర్శులు వచ్చిన విషయం తెలిసిందే. రుణాల వసూలులో ఈ సంస్థ దౌర్జన్యాలకు పాల్పడటం వల్ల 200 మంది ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఆ వివాదం తరవాత సంస్థపేరును పేరును భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌గా మార్చారు. అలాగే 2019లో షేర్ల మార్పిడి ద్వారా ఈ మైక్రోఫైనాన్స్ కంపెనీని ఇండస్ ఇండ్ బ్యాంక్ టేకోవర్ చేసింది. బ్యాంక్ చేతికి వచ్చాక ఈ కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎంఆర్ రావు పనిచేశారు. ఆయన ఇటీవలే రాజీనామా చేశారు. తమ మైక్రోఫైనాన్స్ కంపెనీలో అవకతవకలు జరుగుతున్నాయని, వీటి గురించి కంపెనీ బోర్డులో ప్రస్తావించినా ఫలితం లేకపోయిందని ఎంఆర్ రావు అంటున్నారు. వసూలు కాని కోట్ల రూపాయల రుణాలను సంస్థ దాస్తోందిన ఆయన ఆరోపిస్తున్నారు. ఈ విషయాలను ఆయన ఆర్‌బీఐతో పాటు ఇండస్ ఇండ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్‌కు లేఖ రాశారు. అక్టోబర్ 17, 24 తేదీలలో ఇండస్ బ్యాంక్ సీఈఓ సుమంత్‌కు లేఖలు వెళ్ళాయని ఎకనామిక్ టైమ్స్ పత్రిక పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంపై ఆ పత్రిక ఇవాళ ఓ ప్రత్యేక కథనం రాసింది.
ఆరోపణలు ఏమిటంటే…
భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ కంపెనీ తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున సూక్ష్మ రుణాలు మంజూరు చేసింది. కరోనా కారణంగా చాలా మంది రుణాలు చెల్లించలేదు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం మూడు నెలలు ఏదైనా ఒక రుణం వసూలు కాకపోతే ఎన్‌పీఏగా పరిగణించాలి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం మొండి బకాయిలకు ప్రొవిజనింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. అంటే లాభాల నుంచి తీసేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే… కంపెనీ నష్టాలను చూపించే పరిస్థితి రావొచ్చు. ఇండస్ ఇండ్ బ్యాంక్ కూడా తన ఖాతాల్లో ఈ మేరకు నష్టాన్ని చూపాల్సి ఉంటుంది. దీన్ని నివారించేందుకు మైక్రో ఫైనాన్స్ కంపెనీ పాత ఎత్తుగడను అమలుఉ చేసింది. బ్యాంకింగ్ రంగంలో సుపరిచితమైన ‘డ్రెస్సింగ్ అప్’ పద్ధతి పాటించింది. రుణం చెల్లించని కస్టమర్‌కు… మరో రుణం మంజూరు చేసి…కొత్త రుణం మొత్తాన్ని పాత రుణానికి జమ చేయడం లోపాయికారీగా బ్యాంకుల్లో జరిగేదే. ఇలా చేయడం వల్ల ఎన్‌పీఏల బెడద నుంచి తప్పించుకోవచ్చు. మరోవైపు సదరు కస్టమర్ నుంచి అసలు రుణం వసూలుకు ప్రయత్నం చేయడం. అయితే పాత రుణం చెల్లింపు కోసం కొత్త రుణం మంజూరు చేసినట్లు చాలా మంది కస్టమర్లకు తెలియదు. ఇది బ్యాంకు అంతర్గతంగా జరిగేది. పైగా పాత రుణంపై ఉన్న వడ్డీని కలిపి కొత్త రుణం ఇస్తారు. అంటే ఖాతాదారుడుకి తెలియకుండానే ఓ అధిక మొత్తంతో కొత్త రుణం మంజూరు అయిపోయి ఉంటుందన్నమాట. ఇలా 80,000 ఖాతాల రుణాల విషయంలో గోల్‌మాల్ చేసినట్లు ఎంఆర్ రావు తన లేఖలో పేర్కొన్నారు. కస్టమర్లకు తెలియకుండానే వారి పేరుతో కొత్త రుణాలు మంజూరు చేశారని ఆయన అంటున్నారు. కోట్లలో ఉన్న బకాయిలను కొత్త ఖాతాల ముసుగులో దాచారాన్నమాట.
అబ్బే అలాంటిదేం లేదు?
ఈ తరహా ఆరోపణలు వచ్చినపుడు స్పందించడానికి తమ బ్యాంక్‌లో ఓ పద్ధతి ఉందని, దాని ప్రకారం భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌పై ఆరోపణలు వచ్చిన తాము విచారించామని ఇండస్ ఇండ్ బ్యాంక్ అంటోంది. అయితే ఇప్పటి వరకు జరిపిన సమీక్షలో ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలలేదని పేర్కొంది. దీంతో వెంటనే చర్య తీసుకోవాల్సిన అవసరం కూడా కన్పించలేదని ఇండస్ ఇండ్ బ్యాంక్ పేర్కొంది.