For Money

Business News

వాల్‌స్ట్రీట్‌: నిరాశపర్చిన యాపిల్‌

యాపిల్‌, అమెజాన్‌ ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండటంతో నాస్‌డాక్‌ నష్టాల్లో ఉంది. అలాగే ఎస్‌ అండ్ పీ 500 కూడా. క్యాటర్‌ పిల్లర్ ఆకర్షణీయ ఫలితాలతో డౌజోన్స్‌ గ్రీన్‌లో ఉంది. మూడు సూచీలు నామమాత్రపు మార్పులతో ఉన్నాయి. ఎపుడైనా గ్రీన్‌లో రావొచ్చు లేదా నష్టపోవచ్చు. ముఖ్యంగా యాపిల్‌ షేర్లు క్రమంగా క్షీణించడం, అదే సమయంలో మైక్రోసాఫ్ట్‌ పనితీరు పుంజుకోవడంతో నాస్‌డాల్‌లో వీటి ప్రభావం మారుతోంది. ఇపుడు ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్‌ నవంబర్‌ వన్‌ స్థానంలో వచ్చింది. సెప్టెంబర్‌తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో యాపిల్‌ కంపెనీ అమ్మకాలు 600 కోట్ల డాలర్లు తగ్గాయి. సరఫరాలో ఇబ్బందుల కారణంగా కంపెనీ ఫలితాలు మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా లేవు. పైగా ప్రస్తుత త్రైమాసికంలో ఫలితాలు ఇంకా తగ్గుతాయని కంపెనీ పేర్కొంది. మరోవైపు మైక్రోసాఫ్ట్‌ షేర్‌ భారీగా పెరుగుతోంది. ఈ ఏడాది ఈ షేర్‌ ఇప్పటిదాకా 45 శాతం పైగా పెరిగింది. యాపిల్‌ షేర్లు కేవలం 15 శాతం మాత్రమే పెరిగాయి. 2010లో మైక్రోసాఫ్ట్‌ను దాటి యాపిల్‌ ముందుకు వచ్చింది. పదేళ్ళపాటు నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది. మళ్ళీ ఇపుడు మైక్రోసాఫ్ట్‌ నంబర్‌ వన్‌ స్థానాన్ని కైవసం చేసుకుంది.