For Money

Business News

స్పోర్ట్స్‌ తొలి యూనికార్న్‌.. చెన్నై సూపర్‌ కింగ్స్‌!

మూడోసారి ఐపీఎల్‌ టైటిల్‌ సాధించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) షేర్లకు మార్కెట్‌లో డిమాండ్‌ పెరుగుతోంది. మంచి ఊపు మీద ఉన్న టీమ్‌కు ఈ ఏడాది పలు కలిసొచ్చే అంశాలు ఉన్నాయి. ఇండియా సిమెంట్స్‌కు చెందిన సీఎస్‌కే షేర్లు అనధికారిక మార్కెట్‌లో ట్రేడవుతున్న విషయం తెలిసిందే. ఇండియా సిమెంట్స్‌ నుంచి విడిపోయి ప్రత్యేక కంపెనీగా సీఎస్‌కే కొనసాగుతోంది. అనధికార మార్కెట్‌లో సీఎస్‌కే షేర్‌ రూ.135 పలుకుతోంది. ఈ లెక్కన కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 4,200 కోట్లకు చేరింది. 2021 ఏప్రిల్‌లో ఈ కంపెనీ షేర్‌ రూ.80 ఉండేది. అంటే అపుడు మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 2,465 కోట్లు ఉండేది. కేవలం 7 నెలల్లో కంపెనీ విలువ భారీగా పెరిగింది. అయితే త్వరలోనే మరో రెండు ఐపీఎల్‌ జట్లను బీసీసీఐ వేలం వేయనుంది. ఈ వేలంలో ఒక్కో జట్లు విలువ రూ. 4,000 కోట్లు పలకవచ్చని భావిస్తున్నారు. ఇదే రేటు వస్తే సీఎస్‌కే విలువ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీకి చెందిన కొందరు వాటాదారులు తమ వాటాను విక్రయించేందుకు సిద్ధమౌతున్నారు. వీరు కంపెనీ వ్యాల్యూయేషన్‌ను వంద కోట్ల డాలర్లు అంటే రూ. 7,500 కోట్లుగా లెక్కిస్తున్నారు. ఇదే వ్యాల్యూయేషన్‌తో వీరు వాటాను అమ్మితే… సీఎస్‌కే దేశంలోని తొలి స్పోర్ట్స్‌ యూనికార్న్‌ అవుతుంది. చిత్రమేమిటంటే… సీఎస్‌కే విలువ తన మాతృసంస్థ ఇండియా సిమెంట్స్‌ విలువను దాటే అవకాశం ఉండటం.