For Money

Business News

ఇంటి రుణాలకు గిరాకీ భలే

హౌసింగ్ రుణాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, అదే సమయంలో ఇంటి ధరలు కూడా అందుబాటులో ఉండటంతో దేశీయ మార్కెట్‌లో గృహ రుణాలకు డిమాండ్‌ పెరుగుతోంది. మార్కెట్‌లో మునుపెన్నడూ లేనంతగా తక్కువ రేట్లకే రుణాలు అందిస్తామంటూ బ్యాంకులు పోటీ పడుతున్నాయి. కొవిడ్‌-19 కారణంగా దెబ్బతిన్న రియల్‌ ఎస్టేట్‌ సెక్టార్‌ ముఖ్యంగా ఇంటి రుణాల మార్కెట్‌ డీలాగా పడింది. ఇక కార్పొరేట్‌ రుణాలకు పెద్దగా డిమాండ్‌ లేదు. ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, హౌసింగ్ కంపెనీలు ఇంటి రుణాల మార్కెట్‌పై అధిక దృష్టి సారించాయి. అన్నీ ఒకేసారి ఈ మార్కెట్‌పై దృష్టి పెట్టడంతో వడ్డీ రేట్లు ఏకంగా 6.5 శాతానికే తగ్గాయి.
‘గృహాలు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. స్థిరాస్తి ధరలు దేశ వ్యాప్తంగా గత కొన్నేళ్లుగా పెద్దగా మారలేదు. ఇదే సమయంలో కొన్ని రంగాల్లో వ్యక్తుల ఆదాయాలు బాగా పెరిగాయి. అందువల్ల గృహాలకు భారీగా గిరాకీ పెరుగుతోంద’ని హెచ్‌డీఎఫ్‌సీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రేణు సుద్‌ కర్నాడ్‌ వెల్లడించారు. రెడీమేడ్ గృహాలకు గిరాకీ బాగా ఉందని, నివాస సముదాయాలను పరిశీలించాకే, కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారనిఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సీఈఓ, ఎండీ వై.విశ్వనాథ గౌడ్‌ పేర్కొన్నారు. 2021 ఆగస్టు నాటికి వార్షిక ప్రాతిపదికన గృహ రుణాల పంపిణీ 9.2 శాతం పెరిగిందని, వచ్చే నెలల్లో ఇది మరింత పెరుగుతుంద’ని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ కొల్లియర్స్‌ ఇండియా సీఈఓ రమేశ్‌ నాయర్‌ వెల్లడించారు.