For Money

Business News

ప్రజలకు కోత పెట్టి… అమ్ముకుంటున్నాయి

ఇపుడు మార్కెట్‌లో కరెంటుకు ఎక్కడ లేని డిమాండ్‌ వచ్చింది. నెల క్రితం వరకు రూ. 3.4 పలికి యూనిట్‌ కరెంట్ ధర ఇపుడు రూ. 20 పలుకుతోంది. ఈ అవకాశాన్ని కొన్ని బద్మాష్ రాష్ట్రాలు వాడుకుంటున్నాయి. తమ రాష్ట్ర ప్రజలకు విద్యుత్‌ సరఫరా చేయకుండా… అక్కడ కోత విధించి… ఆ కరెంట్‌ను ఇండియన్‌ ఎనర్జి ఎక్స్ఛేంజీ (IEX) ద్వారా అమ్ముతున్నాయి. సాధారణంగా వివిధ రాష్ట్రాల్లో కేంద్ర విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంటు పెట్టినపుడు 15 శాతం ‘కేటాయించని వాటా’ ఉంటుంది. అత్యవసరమైనపుడు ఇతర రాష్ట్రాలకు దీన్ని సరఫరా చేస్తారు. సాధారణ పరిస్థితుల్లో ప్లాంటు ఉన్న రాష్ట్రమే వాడుకుంటుంది. డిమాండ్‌ పెరిగినపుడు ఈ ప్లాంట్‌లోని కేటాయించిన వాటాను రాష్ట్రాలు వాడుకుంటాయి. కాని డిమాండ్‌ పెరిగినపుడు ఈ కోటాను ప్రజలకు సరఫరా చేయకుండా… వారికి కోత విధించి.. సదరు విద్యుత్‌ను IEXలో అమ్ముతున్నట్లు కేంద్రం దృష్టికి వెళ్ళింది. దీంతో కేంద్ర విద్యుత్ శాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది. ప్రజలకు కోత పెట్టి… విద్యుత్‌ అమ్ముతున్న రాష్ట్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కేటాయించిన కోటాను పూర్తి ఉపసంహరిస్తామని బెదిరించింది. ఇలా ప్రజల విద్యుత్‌ను ఏడు రాష్ట్రాలు అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది.
ఎలా అమ్ముతారు?
సాధారణంగా కరెంటు ట్రేడింగ్‌ కోసం రాష్ట్రాలు ఇండియన్‌ ఎనర్జి ఎక్స్ఛేంజీ (IEX)ని ఆశ్రయిస్తాయి. అక్కడ ఆన్‌లైన్‌లోనే వివిధ విద్యుత్ సంస్థలు తాము అమ్మదల్చుకున్న విద్యుత్‌ పరిమాణంతో పాటు ధరను కూడా పేర్కొంటాయి. అలాగే డిమాండ్‌ కూడా ఉంటుంది. దాన్ని ప్రతి 15 నిమిషాలకు రేటు మారే అవకాశం ఉంటుంది. స్లాట్లను బట్టి కరెంటు ట్రేడింగ్ ఉంటుంది. పీక్‌ టైమ్‌లో కరెంటు చార్జీలు అధికంగా ఉంటాయి. సరిగ్గా ఈ సమయంలో తమ రాష్ట్రంలో ప్రజలకు కోత విధించి… ఈ ఎక్స్ఛేంజీ ద్వారా పలు రాష్ట్రాలు విద్యుత్‌ అమ్ముతున్నట్లు కేంద్రానికి సమాచారం వెళ్ళింది.