మార్జిన్ తగ్గుతుంది: సువెన్ ఫార్మా
చైనాలో విద్యుత్ సంక్షోభం కొనసాగుతోంది. విద్యుత్ సరఫరా లేని కారణంగా అనేక కంపెనీలు మూత పడ్డాయి. దీంతో చైనా నుంచి దిగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో పలు భారత కంపెనీలు ఇతర దేశాల నుంచి ముడిపదార్థాలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని సువేన్ లైఫ్ సైన్సస్ ఛైర్మన్, సీఈఓ జాస్తి వెంకట్ అన్నారు. ఇవాళ ఆయన సీఎన్బీసీ టీవీ18తో మాట్లాడుతూ తమ ముడిపదార్థాల్లో 15 శాతం వరకు చైనా నుంచి దిగుమతి చేసుకుంటామని ఆయన అన్నారు. పెరిగిన వ్యయాన్ని పూర్తిగా కస్టమర్లపై వేయడం కుదరడం లేదని, ఈసారి కంపెనీ మార్జిన్స్ 7 శాతం దాకా తగ్గే అవకాశముందని అన్నారు. అలాగే షిప్పింగ్ సమస్య కూడా తీవ్రంగా ఉందన్నారు. కంటైనర్లు లభించడం లేదని, గతంలో 7-10 రోజుల్లో దిగుమతి చేసుకునేవారమని.. ఇపుడు మూడు నుంచి నాలుగు వారాలు పడుతోందని ఆయన అన్నారు. వీటన్నింటి కారణంగా కొన్ని ముడి పదార్థాల ధరలు నాలుగు రెట్లు పెరిగాయని ఆయన అన్నారు. ముడిపదార్థాల కారణంగా ఉత్పత్తి ఆలస్యం అవుతోందని, ఉత్పత్తి ఆగిపోయే ప్రమాదం కూడా ఉందని ఆయన అన్నారు. ఒకవేళ ముడి పదార్థాలను దేశీయంగా తయారు చేస్తే… అవి పూర్తయ్యే సరికి చైనా తన ఉత్పత్తుల ధరలను బాగా తగ్గించే అవకాశముందని జాస్తి వెంకట్ అన్నారు.