రూ.338 కోట్లు ముంచిన ‘రోబో’ నిర్మాత
రజనీకాంత్ ‘రోబో’ మూవీ తెచ్చిన ఉత్సాహం ఏమోగాని… ఆ సినిమాను తెలుగులో విడుదల చేసిన నిర్మాత తోట కన్నారావు … నిజ జీవితంలో బ్యాంకులకు కలర్ ఫుల్ సినిమా చూపించారు. శంకర్‌ను మించి గ్రాఫిక్స్‌తో మరిపించాడు 2009లో కంపెనీ పెట్టి… 2010లో సినిమా విడుదల చేసి.. 2015లోనే తన నెట్‌వర్త్ రూ. 744.88 కోట్లని, తన భార్య నెట్‌వర్త్ రూ.62.70 కోట్లని బ్యాంకుల నమ్మించారు. శంకర్ సినిమాలో గ్రాఫిక్స్‌ను మరింపించే స్థాయిలో తన వద్ద సరుకు స్టాక్ ఉందని లెక్కలు చూపారు కన్నారావు. చేసేది మొక్క జొన్న, వేప గింజల వ్యాపారం. తాను పెట్టిన శ్రీ కృష్ణా స్టాకిస్ట్స్ అండ్ ట్రేడర్స్ వద్ద 2014లో రూ.232.08 కోట్ల నిల్వలు ఉన్నాయని సర్టిఫికెట్లు చూపించాడు. ఆడిటర్ సర్టిఫికేషన్ కూడా ఇచ్చారు. దివాలా తీశాక 2017లో అక్కడి కెళ్ళి చూసిన బ్యాంకులకు ఆ స్టాక్ విలువ రూ.28.34 కోట్లని తెలిసి తెల్లబోయారు. బ్యాంకుల నుంచి రుణం కోసం 2014లో ఏకంగా 14 ఆస్తులను (ఇందులో 13 ఓపెన్ ల్యాండ్స్- ఒకటి రెసిడెన్షియల్ ఫ్లాట్) ఆయన తాకట్టు పెట్టాడు. అవన్నీ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న భూములు. అపుడు ఆయన చూపిన ఆ ఆస్తుల విలువ రూ.232.23 కోట్లు. ఇంతకీ ఈ ఆస్తులను మదింపు వేసింది ఎవరనుకున్నారు? ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ అండ్ టెక్నికల్ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్ లిమిటెడ్ (ఎపిట్కో), మిట్కాన్లు. రెండు పోటీ పడి అయిదు కోట్లు అటూ ఇటుగా ఇదే మొత్తం చూపాయి. ఈ సంస్థల వాల్యూయేషన్‌ను బట్టి రుణాలు ఇచ్చాయి బ్యాంకులు. దివాలా తీసిన కన్నారావు ఆస్తులను వేలం వేద్దామని ప్రయత్నించిన బ్యాంకులకు మరో పెద్ద షాక్ తగిలింది. ఆ మొత్తం 14 ఆస్తుల విలువ (2019 జూన్ 12వ తేదీన) రూ. 31.15 కోట్లని, అమ్మితే వచ్చే మొత్తం రూ.28.02 కోట్లేనని తేలింది. 2015లో కన్నారావు చూపిన సినిమా చూసి కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో కన్సార్టియం రూ.152 కోట్లు, ఐడిబీఐ బ్యాంక్ రూ.30 కోట్ల రుణం ఇచ్చాయి. వడ్డీ కలిపి 2020 డిసెంబర్ 31వ తేదీ నాటికి కెనరా బ్యాంక్‌కు చెల్లించాల్సిన మొత్తం రూ.281.61 కోట్లని, ఐడీబీఐ బ్యాంక్‌కు ఇవ్వాల్సిన మొత్తం రూ.53.76 కోట్లని తేలింది. వెరశి రూ. 338.37 కోట్లని సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో బ్యాంకులు పేర్కొన్నాయి. 2017లోనే కన్నారావు చేతులు ఎత్తేశారు. ఇక అకౌంట్స్ అన్నీ ఫోరెన్సిక్ ఆడిట్ చేయగా… రోబోలోని కనెక్షన్లు బయటపడ్డాయి. ఇక చేసేది లేక బ్యాంకులు ఈ ఏడాది ఆరంభంలో సీబీఐకి అప్పగించారు. గత నెల 30న ఈ కేసును హైదరాబాద్ సీబీఐ కోర్టులో అధికారులు వేశారు. కన్నారావు ఈ మోసాన్ని కేవలం రెండేళ్ళలో అంటే 2014-15, 2015-16లోనే పూర్తి చేశాడు. చేతికి డబ్బులు వచ్చాక.. ఆ తరువాతి ఏడాదే అంటే 2017లో జెండా ఎత్తేశాడు. సినిమా చాలా ఫాస్ట్‌గా రజనీ స్టైల్లో ప్రారంభమైంది. 2017లోనే టైటిల్ కార్డు పడింది.