బ్యాంకులు ఇచ్చిన అప్పు రూ.1,588 కోట్లు..
కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్)కు వివిధ బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ. 1588 కోట్లు ఉన్నట్లు లెక్క తేలుతోంది. కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌కు ఐసీఐసీఐ బ్యాంకు ఒక్కటే రూ.562 కోట్లు అప్పు ఇచ్చింది. ఇంకా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇండస్‌ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, డీసీబీ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్… ఇచ్చిన అప్పులు కలిసి డిసెంబరు 31, 2020 నాటికి మొత్తం రూ.1,588 కోట్ల మేరకు ఉన్నాయి. కానీ కార్వీ స్టాక్ బ్రోకింగ్ ఖాతా పుస్తకాల్లో ఇంత అప్పు ఉన్నట్లు కనిపించకపోవడంతో…ఈ లెక్కల్లో మాయామర్మంపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. వాస్తవానికి మార్చి 31, 2019 నాటికి కంపెనీ ఆడిటెడ్ ఖాతాల ప్రకారం బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.416 కోట్ల అప్పు తీసుకున్నట్లు మాత్రమే ఉంది. ప్రతి ఏడాది బ్యాంకులు తాము ఇచ్చిన రుణాలు ఎలా వినియోగించారో తెలుసుకుంటాయి. దీనికి థర్డ్ పార్టీ ఆడిట్ సంస్థల నుంచి ‘వినియోగ ధ్రువీకరణ పత్రాన్ని’ తీసుకుంటాయి. కానీ కార్వీ స్టాక్ బ్రోకింగ్ విషయంలో అన్ని రకాల నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలింది. బ్యాంకుల సొమ్ము ఎక్కడికి వెళ్ళిందో పసిగట్టలేకపోయారు. కొన్నేళ్ళుగా ఈ లోపాలను బ్యాంకులు ఎందుకు గుర్తించలేదనే అంశంపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించినట్లు తెలిసింది.
(courtesy:eenadu)