రోజుకు రూ.1000 కోట్ల నికరలాభం?
దేశంలో కొవిడ్ దెబ్బకు లక్షలాది కుటుంబాలు దిక్కులేనివి అయ్యాయి. కాని కుబేరుల సంపద మాత్రం జెట్ స్పీడుతో పెరిగింది. ముఖ్యంగా ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడైన పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం సంపద విలువ కేవలం ఏడాది కాలంలో ఏకంగా 261శాతం పెరిగింది. అదానీ, ఆయన కుటుంబం సంపాదన సగటున రోజుకు వెయ్యి కోట్లు (రూ.1,002 కోట్లు) చొప్పున పెరిగింది. ప్రతి ఏడాది వెలువడే ఐఐఎఫ్ఎల్ వెల్త్-హురున్ ఇండియా 2021 నివేదిక ఇవాళ విడుదల అయింది. అపర కుబేరుల్లో నంబర్ వన్ అయిన ముకేష్ అంబానీ తన స్థానాన్ని పదిలపర్చుకున్నా… సంపద వృద్ధిలో అదానీ కన్నా వెనుకబడ్డారు. గత ఏడాది అంబానీ నికర లాభం సగటున రోజుకు రూ.169 కోట్లు మాత్రమే పెరిగింది. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఆస్తుల విలువ గతేడాది 9శాతం పెరిగి రూ.7,18,000 కోట్లకు చేరింది. కాని గతేడాది రూ.1,40,200 కోట్లుగా ఉన్న గౌతమ్ అదానీ కుటుంబం ఆస్తుల విలువ ఏకంగా రూ.5,05,900 కోట్లకు చేరుకుంది. రూ. 2,36,600 కోట్లతో హెచ్‌సీఎల్ గ్రూప్ అధినేత శివనాడార్ మూడో స్థానంలో ఉన్నారు. ఈయన సంపద గత ఏడాది 67 శాతం పెరగడం విశేషం. టాప్ టెన్‌లో అదానీల తరవాత అదే స్పీడుతో సంపదను పెంచుకున్న వ్యక్తి కుమార మంగళం బిర్లా. ఆయన, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు 230 శాతం పెరిగాయి.దీంతో కుబేరుల జాబితాలో ఆయన 13 స్థానాలు పెరిగి 9వ స్థానానికి చేరారు. విచిత్రమేమిటంటే… అదానీ మరో సోదరుడైన వినోద్ శాంతి లాల్ అదానీ, ఆయన కుటుంబ ఆస్తుల విలువ కూడా 212 శాతం పెరిగి రూ. 1,31,600 కోట్లకు చేరడం.