క్రమంగా కరిగిన లాభాలు
ఆల్గో ట్రేడింగ్ మార్కెట్‌ను ఎలా శాసిస్తోందో ఇవాళ్టి ట్రేడింగ్ సరళి చెప్పకనే చెబుతోంది. ఉదయం ఆరంభమైన కొన్ని నిమిషాల్లోనే భారీ లాభాలు ఆర్జించిన నిఫ్టి 45 నిమిషాల్లో ఒక మోస్తరు నష్టాలు పొందింది. 17,860 ప్రాంతంలో మద్దతు అందడంతో … పుంజుకుని ఆల్‌టైమ్ హై 17,947ని తాకింది. అంతే… అక్కడి నుంచి క్రమంగా లాభాలు కరిగిపోతూ వచ్చాయి. మిడ్ సెషన్ తరవాత నిఫ్టి ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 17,819ని తాకింది. ఆ తరవాత కాస్త పెరిగినా… స్వల్పలాభాలతో ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 30 పాయింట్ల లాభంతో 17,853 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇవాళ 60,000పైన క్లోజ్ కావడం విశేషం. ఐటీ షేర్లు కాస్త మద్దతు ఇచ్చినా.. మెటల్స్‌లో వచ్చిన ఒత్తిడిని నిఫ్టి తట్టుకోలేకపోయింది. నిఫ్టి పరిస్థితి ఇలా ఉంటే… మిడ్ క్యాప్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. సూచీ ఇవాళ ఒక శాతంపైగా నష్టంతో ముగిసింది. నిఫ్టి నెక్ట్స్‌ది అదే పరిస్థితి. బ్యాంక్ నిఫ్టి దాదాపు క్రితం స్థాయి వద్దే ముగిసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మార్కెట్ బలహీనంగా ముగిసింది.