ఆ వార్తలన్నీ నిరాధారం: ఎన్డీటీవీ
ఉదయం నుంచి ఎన్డీటీవీని అదానీ గ్రూప్ టేకోవర్ చేస్తోందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ షేర్ అప్పర్ సీలింగ్ అంటే అనుమతించిన గరిష్ఠ స్థాయి వద్ద క్లోజైంది. బీఎస్ఎస్, ఎన్ఎస్ఈలలో పది శాతం లాభంతో ముగిసింది. ఎన్ఎస్ఈలో ఈ షేర్‌ను పది శాతం ధర వద్ద కూడా ఎవరూ అమ్మలేదు. దీంతో కేవలం 1.97 లక్షల షేర్లు మాత్రమే ట్రేడయ్యాయి. అయితే ఈ వదంతులపై ట్రేడింగ్ సమయంలో ఎన్డీటీవీ స్పందించలేదు. ట్రేడింగ్ పూర్తయిన తరవాత ఓ పత్రికా ప్రకటన జారీ చేసింది. కంపెనీలో తమ వాటాను విక్రయించేందుకు ఇప్పటికైతే ఎవరితోనూ చర్చలు జరపలేదని ఎన్డీటీవీ ప్రమోటర్లయిన రాధిక రాయ్, ప్రణయ్ రాయ్ అన్నారు. వీరిద్దరికీ కంపెనీలో 61.45 శాతం వాటా ఉంది. కంపెనీ యాజమాన్య మార్పుపై కూడా సంప్రదింపులు జరపలేదన్నారు. మార్కెట్లో షేర్ ధర ఎందుకు పెరిగిందో తమకు తెలియదన్నారు.