దుమ్ము రేపుతున్న క్రూడ్
అంతర్జాతీయ మార్కెట్లో క్రూ్డ్ ధరలకు అడ్డే లేకుండా పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలోని పలు కీలక రాష్ట్రాల్లో ఇటీవల వచ్చిన హరికేన్ దెబ్బకు అనేక క్రూడ్ డ్రిల్లింగ్ కంపెనీలు మూతపడ్డాయి. అప్పటి నుంచి చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ అమెరికా వారాంతపు క్రూడ్ నిల్వల డేటా వచ్చింది. గతవారం క్రూడ్ నిల్వలు 15 లక్షల బ్యారెల్స్ తగ్గాయి. ఈ వారం కూడా 35 లక్షల బ్యారెల్స్ తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేశారు. కాని వాస్తవానికి 64 లక్షల బ్యారెల్స్ తగ్గే సరికి క్రూడ్ ధరలు రెండున్నర శాతంపైగా పెరిగాయి. అమెరికా మార్కెట్లో విక్రియంచే WTI క్రూడ్ ధర 72.55 డాలర్లను దాటగా, ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్ క్రూడ్ ధర 75.50 డాలర్లను దాటింది. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం 76 డాలర్లను బ్రేక్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. డాలర్ స్థిరంగా ఉంది. ఇక వాల్స్ట్రీట్లో పెద్ద మార్పు లేదు. నాస్డాక్ స్థిరంగా క్రితం ముగింపు వద్దే ఉంది. డౌజోన్స్, ఎస్ అండ్ పీ 500 సూచీలు మాత్రం 0.33 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి.