ఓల్డ్ మాంక్ రమ్ కాదా?
తమది రమ్ అంటూ ఓల్డ్ మాంక్‌ను కంపెనీ అమ్మడం సరికాదని ఫుడ్ సేఫ్టీ అధికారులు (The Food Safety and Standards Authority of India -FSSAI) పేర్కొనడం ఇపుడు జాతీయ స్థాయిలో సంచలనం కల్గిస్తోంది. యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీకి చెందిన మెక్‌డోవెల్స్ కూడా నంబర్ 1 రమ్ బ్రాండ్‌ను అమ్ముతోంది. యాంటిక్విటీ బ్లూ విస్కీ, రాయల్ ఛాలెంజ్ విస్కీలతో పాటు బ్యాగ్‌పైపర్ డీలక్స్ విస్కీ, ఓల్డ్ కాస్క్ డీలక్స్ రమ్‌ల విక్రయాలపై FSSAI అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేశారు. దీంతో FSSAI సూచనల మేరకు లేబుళ్లలోనే మార్పులు చేయడానికి కంపెనీలు అంగీకరించాయి. ఇపుడు తాజాగా ఓల్డ్‌మాంక్‌కు సంబంధించిన కేసు బాంబే హైకోర్టులో విచారణకు వచ్చింది. న్యూట్రల్ ఆల్కహాల్, రమ్ ఫ్లేవర్‌తో తయారు చేసిన ఓల్డ్ మాంక్‌ను ‘రమ్ ఫ్లేవర్డ్ స్పిరిట్’గా మాత్రమే అమ్మాలని FSSAI కోర్టుకు తెలిపింది. ఇదెంత మాత్రం రమ్ కాదని పేర్కొంది. ఈ డ్రింక్‌ను ‘రమ్’ పేరుతో అమ్మడానికి ససేమిరా అంది. ఇప్పటి వరకు ఓల్డ్ మాంక్ బాటిల్స్‌పై ‘7 Years Old Blended’ అని ఉండేది. దీనిపై FSSAI తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఇలాంటి లేబుల్స్ చూసి ఈ పానీయాన్ని ఏడేళ్ల పాటు నిల్వ ఉంచి తయారు చేశారని కస్టమర్లు భావించే అవకాశం ఉందని పేర్కొంది. దీనిపై ఫ్లేవర్డ్ స్పిరిట్ అని మాత్రమే అమ్మాలని FSSAI లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. బాటిల్ లేబుల్‌పై రాసిన కొన్ని వివరాలు అసలు చదవడానికి కూడా వీల్లేనంత చిన్న అక్షరాల్లో ముద్రించడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో లేబుల్‌పై ఆ ఇంగ్లీషు పదాలను తొలగించడంతో పాటు అక్షలురాలు పెంచేందుకు కంపెనీ అంగీకరించింది. సవరించిన కొత్త లేబుల్‌ను అధికారులకు కంపెనీ సమర్పించింది. అయితే వీటిని పరిశీలించి ఆమోదం తెలిపేందుకు కొంత సమయం కావాలని FSSAI లాయర్ కోర్టు అనుమతి కోరారు. దీంతో కేసు ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది.
