భారత మార్కెట్లోకి క్రాస్ టవర్
క్రిప్టో కరెన్సీపై ప్రభుత్వ విధానాల్లో అయోమయమున్నా… అమెరికాకు చెందిన ప్రముఖ డిజిటల్ కరెన్సీ ఎక్స్ఛేంజీ క్రాస్ టవర్ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. 35 మంది ఉద్యోగులకు మనదేశంలో ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఆరేడు నెలల్లో సిబ్బంది సంఖ్యను వంద మందికి పెంచుతామని క్రాస్ టవర్ ఇండియా కంపెనీ అంటోంది. 2019లో అమెరికాకు చెందిన బినాన్స్ మన మార్కెట్లోకి వచ్చిన విషయం తెలిసిందే. 2020 ఏప్రిల్‌లో మన దేశంలో క్రిప్టో కరెన్సీ వ్యాపారం 9.23 కోట్ల డాలర్లు ఉండగా, ఇపుడు 660 కోట్ల డాలర్లకు చేరిందని బ్లాక్‌చైన్ డేటా సంస్థ ఛైన్ అనాలిసిస్ అంటోంది. క్రిప్టో కరెన్సీ వ్యాపారంలో భారత్ 11వ స్థానంలో ఉంది. భారత్ కేంద్రంగా చేసుకుని ఇతర దేశాల్లోకి కూడా విస్తరిస్తామని క్రాస్ టవర్ ఇండియా సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కపిల్ రాఠి రాయిటర్స్ వార్తా సంస్థతో అన్నారు.