For Money

Business News

మాకు ఒక్క పైసా ఇవ్వండి చాలు

తమిళనాడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో… హెల్త్‌ సెంటర్లలో పుట్టిన ప్రతి బిడ్డకు ఒక గ్రాము బంగారపు రింగ్‌ ఇస్తామని ఆ రాష్ట్ర సీఎం విజయ్‌ ప్రకటించారు. సుమారు 4.42 లక్షల మంది పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వ అంచనా. ఇప్పటి ధరల ప్రకారం ఈ స్కీమ్‌కు రూ. 755 కోట్లు కేటాయించారు. అయితే బంగారం తాము ఇస్తామని (ఖర్చు తాము భరిస్తామని) వాటిని రింగుగా తయారు చేసి… సరఫరా చేసే పని కోసం తమిళనాడు ప్రభుత్వం బిడ్‌లు పిలిచింది. అంటే మేకింగ్‌, ఇతర చార్జీల కోసం టెండర్లు పిలిచారు. జీఆర్‌టీ జువలర్స్‌ కంపెనీ ఓ రింగు కోసం రూ. 410.07లు కోట్‌ చేసింది. ఉమ్మిడి బంగారు జువలర్స్‌ కోట్‌ చేసిన ధర రూ. 822.97, టైటాన్‌ ధర రూ. 832.24 కాగా, మలబార్‌ గోల్డ్‌ కంపెనీ రూ.871.38లు కోట్‌ చేసింది. అయితే బిడ్‌లో ఒక రింగు మేకింగ్‌, ఇతర చార్జీల కోసం ఒక్కపైసా ఇవ్వండంటూ జాయ్‌ అలుక్కాస్‌ బిడ్‌ వేసింది. దీంతో ఈ కాంట్రాక్ట్‌లో జాయ్‌ అలుక్కాస్‌ ఎల్‌1 బిడ్డర్‌గా నిలిచింది. బంగారం కోసం మార్కెట్‌ ధరను బట్టి తమిళనాడు ప్రభుత్వం చెల్లిస్తుందని… తాము కేవలం ఒక్క పైసాకే సర్వీసులు అందిస్తామని కంపెనీ పేర్కొంది. దీన్ని తాము ఒక సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని… ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకానికి తమ వంతుగా సాయం చేయాలని నిర్ణయించామని జాయ్‌ అలుక్కాస్‌ పేర్కొంది. ఈ ప్రాజెక్టును తాము వాణిజ్య లావాదేవీగా భావించడం లేదని తెలిపింది. అయితే జాయ్‌ అలుక్కాస్‌ బిజినెస్‌ వ్యూహం బులియన్‌ మార్కెట్‌ను ఆశ్చర్యంలో పడేసింది. ఈ బిడ్‌ ద్వారా తమిళనాడుతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కంపెనీకి ఆయాచితంగా పబ్లిసిటీ లభిస్తుందని, పైగా మంచి ఇమేజీ కూడా వస్తుందని మార్కెటింగ్‌ వర్గాలు అంటున్నాయి. కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే పబ్లిసిటీ ఈ ఒక్క బిడ్‌తో వచ్చిందని అంటున్నారు. జువలరీ మార్కెట్‌లో నానాటికీ పోటీ పెరుగుతున్న సమయంలో జాయ్‌ అలుక్కాస్‌ మంచి వ్యూహంతో బిడ్‌ వేసిందని మార్కట్‌ విశ్లేషకులు అంటున్నారు.

జోయ్‌అలుకాస్‌ మాదిరే తక్కువ ధరకు రింగ్స్‌ సరఫరా చేస్తామని కళ్యాణ్‌ జువలర్స్‌ ముందుకు రావడంతో… రెండు కంపెనీలకు 70:30 నిష్పత్తిలో వర్క్‌ ఆర్డర్‌ను పంచారు.

Leave a Reply