For Money

Business News

లలితాకు దరఖాస్తు చేయొచ్చా?

లలితా జువల్లర్స్‌ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. రూ. 1700 కోట్లు సమీకరించేందుకు ఈ కంపెనీ 17వ తేదీన ప్రైమరీ మార్కెట్‌కు రానుంది. 19న ముగియనున్న ఈ పబ్లిక్‌ ఆఫర్‌ కింద రూ.190-రూ. 201 ధరల శ్రేణితో షేర్లను ఆఫర్‌ చేస్తోంది. పబ్లిక్‌ ఇష్యూ మొత్తంలో రూ. 1200 కోట్లు తాజా షేర్ల జారీ ద్వారా చేస్తుండగా, ఇపుడున్న ఇన్వెస్టర్లు రూ. 500 కోట్ల విలువైన షేర్లను అమ్ముతున్నారు. పబ్లిక్‌ ఇష్యూ తరవాత కంపెనీలో ప్రమోటర్ల వాటా 82.5 శాతం ఉంటుంది.
పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా సమకూరే రూ. 1200 కోట్లలో రూ. 1033 కోట్లను కొత్తగా మరో పది షోరూమ్‌లు ప్రారంభించేందుకు ఖర్చుచేస్తామని ప్రమోటర్లు అంటున్నారు. ఇష్యూ ముందు కంపెనీల టర్నోవర్‌, లాభం అనూహ్యంగా పెరగడం గతంలో చాలాసార్లు చూశాం. అలాగే ఈ కంపెనీ టర్నోవర్‌ కూడా అనూహ్యంగా పెరిగింది. FY 24లో రూ. 16788 కోట్లు ఉన్న టర్నోవర్‌ FY2026లో రూ. 25024 కోట్లకు పెరిగింది. బంగారం ధరలు కూడా అనూహ్యంగా పెరగడం కూడా దీనికి ఒక కారణం. కంపెనీ నికర లాభం కూడా ఇదే కాలంలో రూ. 360 కోట్ల నుంచి రూ. 1010 కోట్లకు పెరిగింది. మార్చి కూడా 2 శాతం నుంచి రెట్టింపై 4 శాతానికి పెరిగింది. తాజా డేటా ప్రకారం ఒక్కో షోరూమ్‌ తలసరి ఆదాయం రూ. 410 కోట్లు కాగా, చదరపు అడుగుకు రూ. 3.84కోట్ల వ్యాపారం చేస్తోంది. లిస్టయిన కంపెనీల్లో అత్యధికం ఇదే.
టర్నోవర్‌ కరెక్ట్‌గా FY2026లో ఏకంగా 48 శాతం పెరిగింది. పైగా ఈ కంపెనీ వ్యాపారంలో ఏకంగా 92.33 శాతం టర్నోవర్‌ నగల అమ్మకం ద్వారానే వస్తోంది. ధరలు పెరగడం వల్ల టర్నోవర్‌ పెరిగినట్లుంది. ఎందుకంటే షోరూమ్‌ తలసరి ఆదాయం 28 శాతం మేర తగ్గింది. అయితే వర్కింగ్ క్యాపిటల్‌ సైకిల్‌ మాత్రం ఇండస్ట్రీలో బెస్ట్‌ 65 రోజులు ఉంది. ఇక కంపెనీ గోల్డ్‌ ధరల్లో హెచ్చుతగ్గులకు హెడ్జ్‌ చేయదని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. అంటే ధరల్లో హెచ్చు తగ్గులను తట్టుకునేందుకు మెటల్స్‌ లోన్‌ లేదా డెరివేటివ్స్‌లో ఈ కంపెనీ హెడ్జ్‌ చేయదు. అలాగే పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా కంపెనీకి వచ్చే రూ. 1200 కోట్లలో ఏకంగా రూ. 1000 కోట్లను కొత్త షాప్‌లపై పెడుతోంది. అంటే మున్ముందు కూడా హెడ్జింగ్‌ కోసం కంపెనీ వద్ద క్యాపిటల్‌ ఉండదన్నమాట. రూ. 1010 కోట్ల నికర లాభం ఆర్జిస్తున్న ఈ కంపెనీ వద్ద ఆపరేటింగ్‌ క్యాష్‌ ఫ్లో చాలా తక్కువగా ఉంటుందని అనలిస్టుల మరో వాదన. FY2026 అర్నింగ్స్‌ను 11.3 రెట్లు డిస్కౌంట్‌ చేస్తూ కంపెనీ వ్యాల్యూయేషన్‌ లెక్క గట్టారు. ఇపుడు మార్కెట్‌లో ఉన్న సెన్కో గోల్డ్‌ షేర్‌ కూడా ఇపుడు 10 రెట్ల పీఈతో ట్రేడవుతోంది. కళ్యాణ్‌ జువల్స్‌, తంగమళై జువల్సర్స్ వంటి షేర్లు మాత్రం 40 రెట్ల పీఈతో ట్రేడవుతున్నాయి. ఈ షేర్లతో పోలిస్తే లలితా జువల్లర్స్‌ షేర్‌ మంచి ధరకే లభిస్తోందని చెప్పాలి. ఇపుడు మార్కెట్‌లో జువలరీ షేర్ల హవా నడుస్తోంది. జూన్‌లో రూ. 330 ఉన్న కళ్యాణ్‌ జువలర్స్‌ షేర్‌ ఈ నెలలో రూ. 649ని తాకింది. ఇపుడు రూ. 608 వద్ద ఉంటోంది. ఇతర జువలరీ షేర్స్‌ కూడా అనూహ్యంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో లలితా జువలర్స్‌ కూడా లిస్టింగ్‌ లాభాలు బాగానే రావొచ్చు. దీర్ఘకాలానికి కూడా ఈ షేర్‌ మంచి ప్రతిఫలాలను అందిస్తుందని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు.

Leave a Reply