BHARTI AIRTEL: BUY
భారతీ ఎయిర్‌టెల్ షేర్లను కొనుగోలు చేయాల్సిందిగా ప్రముఖ ఈక్విటీ రీసెర్చి సంస్థ CLSA సిఫారసు చేసింది. ఏఐ, డేటా సెంటర్లలో భారీ పెట్టబడులతో ప్రవేశిస్తున్న భారతీ ఎయిర్‌టెల్ నుంచి చక్కటి పనితీరు వస్తుందని ఈ సంస్థ పేర్కొంది. ఈ కంపెనీ అనుబంధ సంస్థ నెక్స్‌ట్రా డేటాలో ఏకంగా వంద కోట్ల డాలర్ల పెట్టుబడికి పలు అంతర్జాతీయ కంపెనీలు సంసిద్ధత తెలిపాయి. ఆల్ఫా వేవ్ గ్లోబల్ నేతృత్వంలో ఈ కంపెనీలు పెట్టుబడి పెడుతున్నాయి. ఇందులో స్వయంగా ఆల్ఫా వేవ్ గ్లోబల్ 43.5 కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది. కార్లైల్ మరో 24 కోట్ల డాలర్లు పెట్టుబడి పెడుతుండగా యాంకరేజ్ క్యాపిటల్ 3.5 కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టనున్నాయి. మిగిలిన మూలధనాన్ని ఎయిర్‌టెల్ స్వయంగా పెట్టుబడిగా పెట్టనుందని CLSA వెల్లడించింది. ఈ పెట్టుబడుల తరవాత కూడా కంపెనీపై కంట్రోల్ ఎయిర్‌టెల్‌కే ఉంటుంది.
ఈ ఒప్పందం ముందు నెక్స్‌ట్రా విలువను 310 కోట్ల డాలర్లుగా అంచనా వేశారు. కంపెనీ విస్తరణను వేగవంతం చేయడం కోసమే నిధులను సమీకరిస్తున్నట్లు CLSA పేర్కొంది. ప్రస్తుతం ఉన్న సుమారు 300 మెగావాట్ల సామర్థ్యాన్ని కొన్నేళ్లలో 1 గిగావాట్‌కు పెంచి, 25% మార్కెట్ వాటాను పొందడమే లక్ష్యంగా పెట్టుకోవాలని కంపెనీ భావిస్తోందని తెలిపింది.
నెక్స్‌ట్రా భారతదేశ వ్యాప్తంగా 14 పెద్ద కోర్ డేటా సెంటర్లను, 120కి పైగా ఎడ్జ్ ఫెసిలిటీలతో కూడిన నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. కో-లొకేషన్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మేనేజ్డ్ హోస్టింగ్, డిజాస్టర్ రికవరీ వంటి సేవలను ఈ కంపెనీ అందిస్తోందని CLSA పేర్కొంది.
హైపర్‌స్కేలర్‌లు, కంపెనీలతో పాటు ప్రభుత్వ సంస్థల నుండి డిమాండ్ పెరుగుతూనే ఉన్నందున కంపెనీ విస్తరణ కలిసి రానుంది. AI-సిద్ధంగా ఉన్న డేటా సెంటర్ క్యాంపస్‌లతో సహా మౌలిక సదుపాయాలను విస్తరించడానికి కొత్తగా సమీకరించిన నిధులను కంపెనీ ఉపయోగిస్తుందని CLSA వెల్లడించింది.
గిగావాట్-స్థాయి AI డేటా సెంటర్ క్యాంపస్‌ను నిర్మించడానికి గూగుల్‌తో కూడా నెక్స్‌ట్రా భాగస్వామ్యం కుదుర్చుకున్న విషయాన్ని CLSA ప్రస్తావించింది. నెక్స్‌ట్రా FY25లో రూ.2,080 కోట్ల ఆదాయాన్ని, రూ.790 కోట్ల ఎబిటాతో ఆపటు రూ. 220 కోట్ల లాభాన్ని ఆర్జించవచ్చని భావిస్తున్నారు.
దీంతో భారతీ ఎయిర్‌టెల్ షేర్‌ను ‘అవుట్ పెర్ఫార్మ్’ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు CLSA పేర్కొంది. ఒక్కో షేరు ధర టార్గెట్ రూ.2,310గా పేర్కొంది.
