నిరుద్యోగుల్లో 67% డిగ్రీ హోల్డర్స్
దేశంలో నిరుద్యోగం పెనుభూతంలా మారుతోంది. 2023 డేటా ప్రకారం నిరుద్యోగుల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు డిగ్రీ చేసినవారు ఉన్నారని ఓ సర్వేలో తేలింది. బెంగళూరు కేంద్రంగా ఉన్న అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ 2004 నుంచి 2023 మధ్య కాలానికి సంబంధించిన డేటా విశ్లేషించింది. 20 నుంచి 29 మధ్య వయస్సు గల నిరుద్యోగుల్లో 67 శాతం డిగ్రీ చేసినవారని తేల్చింది. 2017లో వీరి శాతం 46 కాగా… జెట్ స్పీడులో పెరుగుతోందని పేర్కొంది. డిగ్రీ చేసినవారిలో సగం మంది ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారని పేర్కొంది. 48.8 శాతం మంది డిగ్రీ హోల్డర్స్ ఏదో ఒక పనిచేస్తున్నారని…కాని పర్మనెంట్ శాలరీ ఉన్న ఉద్యోగులు చేస్తున్నవారు కేవలం 6.7 శాతం మాత్రమేనని తెలిపింది. అందులో వైట్ కాలర్ జాబ్ చేస్తున్నవారి సంఖ్య 3.7 శాతమని తేల్చింది.
2004 నుంచి 2023 మధ్య కాలంలో ఏటా సుమారు 50 లక్షల మంది గ్రాడ్యుయేట్లు వస్తున్నారని, వీరిలో కేవలం 28 లక్షల మందికి మాత్రమే ఉపాధికల్గుతోందని సర్వే పేర్కొంది. చాలా తక్కువ మంది శాలరీ ఉన్న ఉద్యోగాలు చేస్తున్నారని వెల్లడించింది. గ్రాడ్యుయేట్ నిరుద్యోగం నానాటికి పెరుగుతోందని తెలిపింది. దీంతో ఆదాయ వృద్ధి నానాటికి తగ్గిపోతోందని తెలిపింది. దేశంలో ఇపుడు 15 నుంచి 29 ఏళ్ళ మధ్య వయస్కులు అంటే యువత 36.7 కోట్లని తెలిపింది. ప్రపంచ పని వయస్కుల జనాభాలో మూడో వంతు మన దేశంలో ఉన్నారని తెలిపింది. అయితే 2030 నుంచి మనదేశంలో కీలక మార్పు రానందని సర్వే హెచ్చరించింది. 2030 నుంచి యువత శాతం తగ్గుతుందని, వృద్ధుల శాతం పెరుగుతుందని పేర్కొంది. కాబట్టి వెంటనే వీరికి ఉపాధి కల్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలని పేర్కొంది.
నానాటికి దేశంలో స్కిల్ వర్క్ తగ్గుతోందని సర్వే పేర్కొంది. దేశంలోని ఐటీఐలలో ఎలాంటి నాణ్యత లేదని తెలిపింది. దేశంలో ఐటీఐల సంఖ్య 300 శాతం పెరిగినా… వాటిలో మెజారిటీ వాటా ప్రైవేట్ సంస్థలదేనని పేర్కొంది. వాటిల్లో నాణ్యమైన శిక్షణ లేదని…దీంతో ఉపాధి దొరకడం కష్టంగా మారిందని తెలిపింది.
