For Money

Business News

హెటిరోకు అమెరికా వార్నింగ్‌

హైదరాబాద్‌కు చెందిన హెటిరో గ్రూప్‌నకు అమెరికా షాక్‌ ఇచ్చింది. గ్రూప్‌ కంపెనీ హెటిరో ల్యాబ్స్‌కు చెందిన ల్యాబ్‌లో తయారు చేస్తున్న మందుల నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (US FDA) వార్నింగ్‌ లెటర్‌ పంపింది. ఆంధప్రదేశ్‌, నరసాపురం వద్ద ఉన్న నక్కప్లి ప్లాంట్‌ను గత సెప్టెంబరు 19 నుంచి 26 వరకు FDA నిపుణుల బృందం పరిశీలించింది. ఆ యూనిట్‌లో తయారు చేస్తున్న మందులు అమెరికా మార్కెట్‌కు ఉద్దేశించినవి. అందుకే ఎఫ్‌డీఏ అధికారులు ఆ యూనిట్‌ను తనిఖీ చేశారు. మందుల తయారీలో కంపెనీ తీవ్ర స్థాయిలో నిబంధనలను ఉల్లంఘించినట్లు తన నివేదికలో స్పష్టం చేసింది. తాము గుర్తించిన ఆరు తీవ్ర లొసుగులను ప్రస్తావిస్తూ Form 483ని కంపెనీకి పంపింది. అందులో ముఖ్యంగా పేర్కొన్న అంశం. కంపెనీ యూనిట్‌లో రిజిస్ట్రేషన్‌లోని టెస్టింగ్‌ ల్యాబ్‌ ఉండటం. అంటే ఎలాంటి అనుమతి లేని ల్యాబ్‌ ఇక్కడ తయారు చేసే మందులను పర్యవేక్షిస్తోందన్నమాట. అలాగే క్వాలిటీ కంట్రోల్‌ ప్రాసెస్‌ చాలా దరుణంగా ఉందని ఎఫ్‌డీఏ పేర్కొంది. అలాగే అమెరికా మార్కెట్‌కు ఉద్దేశించిన మందులను ఎలాంటి ఆధీకృత పత్రాలు లేకుండానే కంపెనీ ప్లాంట్‌లో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న గోదాములకు తరలిస్తున్నట్లు కూడా ఎఫ్‌డీఐ బృందం పేర్కొంది. అసలే రిజిస్ట్రేషన్‌ లేని ల్యాబ్‌.. ఆ ల్యాబ్‌ కూడా తాను పరీక్షించిన మందుల డేటాను నమోదు చేయడం లేదని ఎఫ్‌డీఏ అధికారులు గుర్తించారు. దీంతో అమెరికా మార్కెట్‌కు ఉద్దేశించిన ప్రమాణాలను ఈ కంపెనీ ఏమాత్రం ఖాతరు చేయడం లేదని నివేదికలో ఎఫ్‌డీఏ బృందం పేర్కొంది. యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రిడెంట్స్‌ (API) మార్కెట్‌లో ప్రధాన కంపెనీగా ఉన్న హెటిరోకు అమెరికా ఎఫ్‌డీఏ నుంచి ఇలాంటి అభ్యంతరాలు రావడంతో నిపుణులు కూడా ఆశ్చర్యపోతున్నారు. మన దేశం నుంచి API సరఫరా చేసే కంపెనీల్లో హెటిరో రెండో పెద్ద కంపెని. ఎఫ్‌డీఏ అధికారుల ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తే… కంపెనీ ఉత్పతులపై అమెరికా నిషేధం విధించే అవకాశముందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.
ఆ షేర్లకు డిమాండ్‌
హెటిరో ల్యాబ్స్‌ అన్‌ లిస్టెడ్‌ కంపెనీ. హెటిరోకు అమెరికా నుంచి వార్నింగ్‌ లెటర్‌ రావడంతో ఇదే రంగానికి చెందిన లిస్టెడ్‌ కంపెనీల షేర్ల ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. ముఖ్యంగా అరబిందో ఫార్మా అయిదు శాతంపైగా లాభపడింది. అలాగే లారస్‌ ల్యాబ్‌ కూడా భారీగా లాభపడింది. అయితే మంచి లాభాలు ఆర్జించిన దివీస్‌ ల్యాబ్‌ షేర్‌ మాత్రం… చివర్లో లాభాలను కోల్పోయింది.

Leave a Reply