ఆఫ్కాన్స్ అదుర్స్
ఊహించినట్లే ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూ ధర కన్నా డిస్కౌంట్‌తో లిస్టయింది. ప్రముఖ పారిశ్రామిక గ్రూప్ అయిన షాపూర్జీ పల్లోంజి గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీ షేర్లను రూ.463లకు ఆఫర్ చేశారు. అయితే మార్కెట్ భారీ నష్టాల్లో ఉండటంతో ఈషేర్ ఏకంగా 8 శాతం నష్టంతో ఎన్ఎస్ఈలో రూ. 426 వద్ద లిస్టయింది. అయితే కాస్సేపటికే ఈ షేర్ రూ. 420ని తాకింది. అప్పటి నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ షేర్ నష్టాల్లోనే కొనసాగింది. అద్భుత పనితీరు, ప్రముఖ పారిశ్రామిక గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీకి ఇన్వెస్టర్ల నుంచి మద్దతు లభించింది. దీంతో మిడ్ సెషన్ తరవాత ఈషేర్ దూసుకుపోయింది. ఒకదశలో రూ.479కి చేరింది. క్లోజింగ్‌లో 11 శాతం లాభంతో రూ. 472 వద్ద ముగిసింది. పబ్లిక్ ఇష్యూలో చాలా మంది ఇన్వెస్టర్లకు ఈ షేర్లు అలాట్ కాలేదు. వారందరి నుంచి ఇవాళ మద్దతు లభించింది.