For Money

Business News

రీటైల్‌ ఇన్వెస్టర్లే బకరాలు

గత కొన్ని నెలలుగా విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ).. బారత స్టాక్‌ మార్కెట్‌ నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకుంటూ జాగ్రత్త పడుతుంటే, రీటైల్‌ ఇన్వెస్టర్లు పొలోమంటూ పెట్టుబడులకు దిగుతున్నారని బ్రోకరేజీ సంస్థ యూబీఎస్‌ పేర్కొంది. స్విట్జర్లాండ్‌ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ఇప్పటికే ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరిన మార్కెట్‌ వాల్యుయేషన్లు కొనసాగే అవకాశాలపైనా అనుమానాలు వ్యక్తం చేసింది. జూలై నుంచి ఎఫ్‌పీఐలు భారత మార్కెట్‌ నుంచి 110 కోట్ల డాలర్ల నికర పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయాన్ని గుర్తు చేసింది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ లిస్టయిన కంపెనీల షేర్లలో రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా ఇప్పటికే 12 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలోనే దేశీయ రిటైల్‌ ఇన్వెస్టర్లు మార్కెట్‌లో దాదాపు 500 కోట్ల డాలర్లు (సుమారు రూ.37,110 కోట్లు) ఇన్వెస్ట్‌ చేశారు. ఇందులో ఎక్కువ బాగం బీ గ్రూప్‌ షేర్లలోనే మదుపు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో కొనసాగుతున్న స్మాల్‌ అండ్‌ మిడ్‌ క్యాప్‌ షేర్ల కరెక్షన్‌లో నష్టపోతోందీ రిటైల్‌ ఇన్వెస్టర్లే. బ్యాంక్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లు కనిష్ఠ స్థాయికి చేరడం, ఊపందుకున్న టీకా కార్యక్రమంతో రిటైల్‌ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున స్టాక్‌ మార్కెట్‌పై ఆసక్తి చూపిస్తున్నారని యూబీఎస్‌ నివేదిక తెలిపింది.