For Money

Business News

అలా రాగానే… ఇలా అమ్మేస్తున్నారు

పబ్లిక్‌ ఇష్యూలో షేర్లు పొందిన ఇన్వెస్టర్లు… వాటిని చాలా కాలం ఉంచుకోవడం లేదని స్టాక్‌ మార్కెట్ నియంత్రణ సంస్థ -సెబీ పేర్కొంది. ఐపీఓలో షేర్లు అలాట్‌మెంట్‌ జరిగిన వారంలోనే 54 శాతం మంది ఇన్వెస్టర్లు తమకు వచ్చిన షేర్లను అమ్మేస్తున్నారని సెబీ పేర్కొంది. 2021 ఏప్రిల్‌ నుంచి 2023 డిసెంబర్‌ మధ్య కాలంలో వచ్చిన 144 పబ్లిక్‌ ఇష్యూల డేటాను అధ్యయనం చేసిన తరవాత సెబీ ఈ వివరాలను వెల్లడించింది. ఇందులో ఆకర్షణీయ లాభాలు వచ్చిన పబ్లిక్‌ ఇష్యూ షేర్లను వెంటనే అమ్మేసే ఇన్వెస్టర్ల సంఖ్య ఇంకా ఎక్కువ ఉందని పేర్కొంది. 20 శాతం మించి లాభం వస్తే వారంలోనే 67.6 శాతం విలువైన షేర్లను ఇన్వెస్టర్లు అమ్మేస్తున్నారని తెలిపింది. అదే లిస్టింగ్‌ తరవాత నష్టాలు వస్తే 23.3 శాతం షేర్లను తమ వద్దే ఉంచుకుంటున్నారని పేర్కొంది. వ్యక్తిగత ఇన్వెస్టర్లు 70 శాతం షేర్లను ఏడాదిలోపే విక్రయిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. అదే సమయంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ మాత్రం ఎక్కువ కాలం అట్టిపెట్టుకుంటూ ఉండగా.. బ్యాంకులు కూడా వేగంగానే షేర్లను విక్రయించేస్తున్నట్లు సెబీ వెల్లడించింది. కొవిడ్‌ తర్వాత అత్యధిక సంఖ్యలో డీమ్యాట్‌ ఖాతాలు పెరగ్గా.. ఐపీఓల్లో పెట్టుబడులు కూడా అదే స్థాయిలో పెరిగాయని సెబీ పేర్కొంది. మొత్తం డిమాట్‌ అకౌంట్లలో 85 శాతం అకౌంట్లు 2016 నుంచి 2023 మధ్య కాలంలో అంటే ఎనిమిదేళ్ళలో తెరిచినవేనని తెలిపింది.