బంగారం ధర రూ. 70,000?
అమెరికా డాలర్‌తో రూపాయి స్థిరంగా ఉండటం, అంతర్జాతీయ వృద్ధి రేటు మందగిస్తున్న నేపథ్యంలో బులియన్ ధరలు మరింత పెరిగే అవకాశాలు అధికంగా కన్పిస్తున్నాయి. ముఖ్యంగా చైనా వృద్ధి రేటు తగ్గడంతో షేర్ మార్కెట్ బుల్ రన్‌పై కూడా అనుమానాలు ఉన్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ 2024 ప్రథమ త్రైమాసికంలో మాంద్యంలోకి వెళుతుందన్న వార్తలు నిజమయ్యే పక్షంలో బంగారం, వెండి ధరలు కొత్త రికార్డు స్థాయికి పెరిగే అవకాశముంది. అమెరికా మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర డిసెంబర్ 4వ తేదీన 2140 డాలర్లకు చేరింది. ఇదే సమయంలో మన మార్కెట్లో పది గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర రూ. 64,063లకు చేరింది. అయితే 2024లో ఔన్స్ బంగారం ధర 2400 డాలర్లకు చేరుతుందని కామ్‌ట్రెండ్స్ రీసెర్చ్ డైరెక్టర్ గుణశేఖర్ త్యాగరాజన్ అన్నారు. ఈటీ నౌ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ ఇదే జరిగితే మన దేశంలో పది గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర రూ. 70,000లకు చేరుతుందని అన్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో పాటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టబడులు తగ్గే పక్షంలో బులియన్‌కు గట్టి డిమాండ్ ఉంటుందని ఆయన అంటున్నారు. ధరలు అధికంగా ఉన్నందున బంగారం రీటైల్ అమ్మ కాలు తగ్గినా… వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేయొచ్చని కొటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ (కమాడిటీస్ హెడ్) రవీంద్ర రావు అంటున్నారు. బంగారం బార్లకు, కాయిన్స్‌కు డిమాండ్ పెరుగుతుందన్నారు.