పెట్రోల్, డీజిల్ ధరలో భారీ కోత?
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే భారత్ బ్రాండ్ పేరుతో కిలో పప్పు, కిలో ఆటా రూ. 25 చొప్పున అమ్ముతోంది. త్వరలోనే కిలో బియ్యం రూ. 25 చొప్పున విక్రయించేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని మోడీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీటి ధరలు తగ్గించేందుకు మూడు మార్గాలను అన్వేషిస్తోందని.. అందులో ప్రధానమైంది… లీటరు ధర రూ 10 తగ్గించడమని ఈ వార్తా సంస్థలు అంటున్నారు. పెట్రోల్, డీజిల్ లీటరు ధర రూ.10 తగ్గించే అవకాశముందని సీఎన్ఎన్ న్యూస్ 18 ఛానల్ పేర్కొంది. ఇదే తరహా వార్తను జీ బిజినెస్ ఛానల్ కూడా ఇస్తోంది. ఈ ప్రతిపాదనకు ఇదివరకేఆర్థిక శాఖ నుంచి ఆమోదం వచ్చిందని… ప్రధాని మోడీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే తరువాయి అని ఈ వార్తా సంస్థలు అంటున్నాయి. జనవరి 1వ తేదీలోగా ఈ మేరకు అధికారిక ప్రకటన రావొచ్చని తెలుస్తోంది. తగ్గింపు విషయంలో ఓ ఫార్మాలను కేంద్రం తెచ్చినట్లు సమాచారం. తగ్గించే రూ. 10ల భారాన్ని చెరో సగం భరించాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంటే తగ్గింపు భారంలో కేంద్రం రూ.5, ఆయిల్ కంపెనీలు రూ.5 చొప్పున భరిస్తాయన్నమాట. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 125 డాలర్లకు చేరిన సమయంలో వరుసగా రేట్లు పెంచిన కేంద్రం… తరవాత క్రూడ్ ధర తగ్గినా… దేశీయ మార్కెట్లో వీటి ధరలు తగ్గించలేదు. ఇపుడు కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు బ్యారెల్ క్రూడ్ ధర 77 డాలర్ల ప్రాంతంలో పడుతోందని సమాచారం.