గోఫస్ట్ విమానాలకు గ్రీన్ సిగ్నల్
ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుని దివాలా ప్రక్రియ ఎదుర్కొంటున్న ఎయిర్‌లైన్స్ సంస్థ గో ఫస్ట్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (DGCA) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 15 విమానాలతో రోజుకు 114 సర్వీసులు నడుపుకొనేందుకు అంగీకరించింది. అయితే కొన్ని షరతులను కూడా విధించింది. వాడియా గ్రూప్‌నకు చెందిన గోఫస్ట్ విమానయాన సంస్థ నిధుల సంక్షోబంతో దివాలా ప్రకటిస్తూనే… సర్వీసులను కూడా నిలిపివేసిన విషయం తెలిసిందే. మే 3 నుంచి విమాన సర్వీసులు నడవడం లేదు. ఢిల్లీ హైకోర్టు, దిల్లీ ఎన్సీఎల్టీ బెంచ్ వద్ద పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్లు/దరఖాస్తులకు సంబంధించిన తీర్పులకు లోబడి ఈ అనుమతులు ఉంటాయని డీజీసీఏ తన ఆదేశాల్లో పేర్కొంది. నిధుల లభ్యత ఆధారంగా షెడ్యూల్ చేసిన విమానాలను తిరిగి ప్రారంభించవచ్చని డీజీసీఏ పేర్కొంది.