అదానీపై దర్యాప్తు… సుప్రీం ఓకే
అదానీ – హిండెన్‌బర్గ్ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు రెండు కీలక ఆదేశాలను జారీ చేసింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్… అదానీ గ్రూప్ కంపెనీ షేర్లకు సంబంధించి దర్యాప్తు చేయాల్సిందిగా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని ఆదేశించింది. అదానీ షేర్ల లావాదేవీలు సెక్యూరిటీస్ కాంట్రాక్ట్‌కు భిన్నంగా ఉన్నాయా లేదా అన్న అంశాన్ని సెబి దర్యాప్తు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. అలాగే అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై దర్యాప్తు చేసేందుకు సుప్రీం కోర్టు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు మాజీ జడ్జి అభయ్ మనోహర్ సప్రే ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీలో ఓపీ భట్, జస్టిస్ జేపీ దేవ్‌దత్, కేవీ కామత్, నందన్ నీలెంకని, సోమశేఖరన్ సుదర్శన్‌లను సభ్యులగా కోర్టు నియమించింది. నిపుణుల కమిటీకి సెబీ, దర్యాప్తు సంస్థలు సహకరించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.