అయిదో రోజూ కొనసాగిన పతనం
ఇవాళ రియాల్టి, పవర్ రంగానికి చెందిన షేర్లు భారీగా క్షీణించాయి. బడ్జెట్ రోజు నాటి కనిష్ఠ స్థాయిని ఇవాళ మార్కెట్ తాకింది. ఆరంభంలో భారీగా నష్టపోయి 17455ని తాకిన నిఫ్టి తరవాత కోలుకుని 17620 స్థాయిని తాకింది. అంటే దాదాపు 170 పాయింట్ల రికవరీ సాధించింది.అయినా… మిడ్ సెషన్ తరవాత మార్కెట్ మళ్ళీ నష్టాల్లోకి జారకుంది. నిఫ్టి 17500 దిగువకు జారింది. చివరల్లో కోలుకుని 17511 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 45 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టి ఒక్కటే స్థిరంగా ముగిసింది. అదానీ షేర్లలో పతనం ఇవాళ కూడా కొనసాగింది. అదానీ ఎంటర్ ప్రైజస్ స్వల్ప నష్టంతో సరిపెట్టుకోగా… అదానీ టోటల్, అదానీ గ్రీన్, అదానీ ట్రాన్స్మిషన్ షేర్లు అయిదు శాతం లోయర్ సీలింగ్‌తో ముగిశాయి. ఎన్డీటీవీ స్వల్ప నష్టంతో క్లోజ్ కాగా, అదానీ గ్రూప్‌నకు చెందిన అంబుజా స్వల్ప లాభంతో, ఏసీసీ స్వల్ప నష్టంతో క్లోజయ్యాయి. అదానీ పోర్ట్స్ ఒక శాతంపైగా లాభంతో ముగిసింది. ఫెడ్ మళ్ళీ వడ్డీ రేట్లను పెంచుతుందనే వార్తలు మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.