ఎఫ్‌పీఓ ధర తగ్గించం.. అదానీ స్పష్టీకరణ
అదానీ గ్రూప్‌లో ఫ్లాగ్షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO) నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనెల 31న ఈ ఆఫర్ ముగియనుంది. కనీసం నాలుగు షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆఫర్ ధార శ్రేణి రూ. 3112 – రూ. 3276. రీటైల్ ఇన్వెస్టర్లకు రూ.64 డిస్కౌంట్ ఇస్తున్నారు. అయితే షేర్ ధర సెకండరీ మార్కెట్లో ఆఫర్ ధరకన్నా దిగువకు వచ్చేసింది. నిన్న అంటే శుక్రవారం అదానీ ఎంటర్‌ప్రైజస్ షేర్ ధర రూ. 2,768లను తాకింది. ఓపెనింగ్ రోజున దాదాపు ఎవరూ దరఖాస్తు చేయలేదు. ఇష్యూలో కేవలం 0.01 శాతం మాత్రమే సబ్స్క్రయిబ్ అయింది. అందులో రీటైల్ ఇన్వెస్టర్ల కోటాలో ఇన్వెస్టర్లు 0.02 శాతం షేర్లకు మాత్రమే దరఖాస్తు చేశారు. ఆఫర్ కనిష్ఠ ధర కన్నా రూ. 350 తక్కువకు సెకండరీ మార్కెట్లో షేర్ లభిస్తున్నపుడు ఎఫ్‌పీఓకు ఎవరు దరఖాస్తు చేశారు. ఎఫ్‌పీఓ ఆఫర్ ధర తగ్గిస్తారేమో అని ఎదురు చూసిన ఇన్వెస్టర్లకు నిరాశ మిగిలింది. ఆఫర్ ధరను తగ్గించడం లేదని…అలాగే ఆఫర్‌ను వాయిదా కూడా వేయడం లేదని అదానీ గ్రూప్ కాస్సేపటి క్రితం స్పష్టం చేసింది. తమ ఇన్వెస్టర్లు, బ్యాంకర్లు ఎఫ్‌పీఓకు దరఖాస్తు చేస్తారన్న ఆశాభావాన్ని కంపెనీ వ్యక్తం చేసింది. అయితే ఇన్వెస్టర్లలో మాత్రం ఆసక్తి లేదు. ఆఫర్ ధర తగ్గించినా ఇన్వెస్టర్లు దరఖాస్తు చేసే అవకాశం లేదని విశ్లేషకులు అంటున్నారు. సెకండరీ మార్కెట్లో ధర పెరిగితే తప్ప… ఎఫ్‌పీఓ సక్సెస్ అయ్యే ఛాన్స్ లేదని వీరు స్పష్టం చేస్తున్నారు.