ఐడీబీఐ బ్యాంక్: కొనేవారికి వెసులుబాట్లు
ప్రభుత్వ రంగానికి చెందిన ఐడీబీఐ బ్యాంక్‌ను కేంద్ర ప్రబుత్వం ప్రైవేటీకరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే బిడ్లు కూడా ఆహ్వానించింది. అయతే స్పందన అంతంత మాత్రమే ఉండటంతో గడువు పొడిగించింది. ప్రైవేటీకణ తరవాత తమ పెత్తనం ఉండదని, అంతా ప్రవేట్ వ్యక్తులదేనని క్లారిటీ ఇచ్చిన కేంద్రం తాజాగా మరో వెసులుబాటు కల్గించింది. కొనుగోలు చేసే కంపెనీలకు పన్ను నిబంధలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. తుది బిడ్ తర్వాత ఐడీబీఐ బ్యాంక్ షేర్ ధర పెరిగితే కొనుగోలుదారులు అదనంగా చెల్లించాల్సి వచ్చే పన్ను నిబంధనలు సడలించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ప్రభుత్వం ఫైనాన్షియల్ బిడ్లను ఆహ్వానించిన తర్వాత సాధారణంగా షేర్ ధరలు పెరుగడం సహజం. బిడ్లు వేసినప్పటి నుంచి లావాదేవీ ముగిసే మధ్య ధరల పెరుగుదలపై పన్ను చెల్లించాలని కొత్త కొనుగోలుదారులను అడగటం భావ్యం కాదని ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. అధికారికంగా ఫైనాన్షియల్ బిడ్లు వేసిన తర్వాత బ్యాంకు షేర్ ధరలు పెరిగితే… పన్ను చట్టాల ప్రకారం కొనుగోలుదారుకు షేర్ ధరలోని వ్యత్యాసాన్ని ఇతర ఆదాయంగా పరిగణిస్తారు. దీనిపై 30 శాతం అదనంగా సర్ఛార్జ్, సెస్ విధిస్తారు. ఈ నేపథ్యంలో పన్ను మినహాయింపు ఇవ్వగలిగితే బ్యాంకు కొనుగోలుకు మరి కొన్ని కంపెనీలు ముందుకొస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.