బజాజ్ హిందూస్థాన్ సుగర్… బుల్ షేర్?
ఈ ఏడాది సగానికిపైగా క్షీణించిన బజాజ్ హిందుస్థాన్ సుగర్ గత శుక్రవారం 20 శాతం అప్పర్ సీలింగ్‌తో ముగిసింది. కంపెనీ రుణాలు చెల్లించడం లేదని బ్యాంకులు కోర్టులను ఆశ్రయించడంతో ఈ షేర్ గత ఆగస్టు నెలలో రూ. 8.37కి పడిపోయింది. అంతకుముందు ఏప్రిల్‌లో ఈ షేర్ రూ.22.58ని తాకింది. చెరకు క్రషింగ్‌తో పాటు ఎథనాల్, పవర్ ప్లాంట్లు ఉన్న ఈ కంపెనీ స్థాపక సామర్థ్యం అధికంగా ఉన్నా… ఎప్పటి నుంచో ఈ రుణాల బెడద ఈ కంపెనీని వెంటాడుతోంది. అయితే నవంబర్ నెల వరకు ఉన్న పెండింగ్ టర్మ్ రుణాలు, ఓసీడీ కూపన్‌పై వడ్డీలను కూడా చెల్లించేసినట్లు బజాజ్ హిందుస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. తనకు ఎలాంటి బకాయిలు లేవని స్పష్టం చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ షేర్ కొనుగోళ్ళ ఆసక్తి పెరిగింది. అన్ని బ్యాంకులకు రుణాలు, వడ్డీ బకాయిలను చెల్లించేశామని.. ఎలాంటి బకాయిలు లేవని పేర్కొంది. దీంతో గత శుక్రవారం కంపెనీ షేర్ రూ.13.52 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో క్లోజింగ్ సమయానికి ఆరు కోట్ల షేర్లు కొనుగోలుకు ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈసారి చెరకు ఉత్పత్తి తగ్గిందని.. మనదేశంలో కూడా చెరకు ఉత్పత్తి తగ్గనుందని అంచనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎగుమతులకు అనుమతి ఇవ్వడంతో పాటు పెట్రోల్, డీజిల్‌లో కలిపే ఎథనాల్ శాతం పెంచడంతో చక్కెర రంగానికి షేర్లు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో బజాజ్ గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీ మున్ముందు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.