గత 5 ఏళ్ళలో రూ. 10 లక్షల కోట్ల రుణాలు రద్దు
చిన్న లోన్ వాయిదా కట్టపోతే బ్యాంకులు నానా హంగామా చేస్తారు. మెసేజ్లకు బదులు ఇపుడు ఏకంగా ఫోన్ వేధింపులే. ఇక రైతు రుణమాఫీ అంటే.. దేశం దివాలా తీస్తోందని అంటారు. ఇక పేదలకు ఉచితాలు అనగానే… జనాన్ని సోమరిపోతులు చేస్తున్నారని ఆరోపిస్తారు. మరి కేవలం అయిదేళ్ళలో కోటీశ్వరులకు చెందిన రూ. 10 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తే…
బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్స్ క్లీన్ చేయడానికి, ఎన్పీఏల భారాన్ని సగానికి తగ్గించేందుకు గాను గత అయిదేళ్ళలో బ్యాంకులు రూ. 10 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసేశాయి. 2017-18లో ఎన్పీఏల శాతం 11.2 శాతం ఉండగా, ఇపుడు 5.9 శాతానికి చేరాయి. ఇలా రద్దు చేసిన మొత్తంలో కేవలం 13 శాతం అంటే రూ. 1.32 లక్షల కోట్లను మాత్రమే బ్యాంకులు వసూలు చేయగలిగాయి. సాధారణంగా రుణాలను రద్దు చేసిన తరవాత… కేవలం పుస్తకాల్లో అడ్జస్ట్మెంట్ కోసమే రద్దు చేస్తామని… తరవాత వాటిని వసూలు చేస్తామని బ్యాంకులు చెబుతుంటాయి. కాని అలా రద్దు చేసిన రూ.10 లక్షల కోట్లలో బ్యాంకు కేవలం 13 శాతం మొత్తాన్ని మాత్రమే వసూలు చేయగలిగాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ఆర్టీఏ ద్వారా ఈ సమాచారాన్ని సంపాదించింది. రద్దు చేసిన మొత్తం రూ. 10 లక్షల కోట్లలో 70 శాతం మొత్తం అంటే రూ. 7 లక్షల కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు రద్దు చేయడం విశేషం. అయితే రుణాలు రద్దు చేసిన కంపెనీల యజమానుల పేర్లను మాత్రం బ్యాంకులు బయట పెట్టడం లేదు.