మిగిలేది ఎయిర్ ఇండియానే
పౌర విమాన రంగంలో తమ కంపెనీలో పరస్పర పోటీ నివారణకు, సంస్థల నిర్వహణ సౌకర్యవంతంగా ఉండేందుకు టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ గ్రూప్‌లోని నాలుగు ఎయిర్‌లైన్స్ బ్రాండ్లను ఒకే గూటికి తీసుకురావాలని భావిస్తోంది. టాటా గ్రూప్‌లో ఎయిర్ ఇండియా, విస్తారా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఏషియా ఇండియా విమాన సంస్థలు ఉన్నాయి. ఇటీవలే ఎయిర్ ఏషియాలో మొత్తం వాటానుకొనుగోలు చేసిన టాటా గ్రూప్ ఈ కంపెనీని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో కలిపేస్తామని చెప్పింది. ఈ కంపెనీని ఇపుడు ఎయిర్ ఇండియా గొడుగు కిందకు తేవాలని భావిస్తోంది టాటా గ్రూప్. ఇక విస్తారాను కూడా ఎయిర్ ఇండియాలో కలిపి వేస్తే… ఒకే కంపెనీ అవుతుంది. ప్రస్తుతం విస్తారాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు వాటా ఉంది. నాలుగు కంపెనీల విలీనం తరవాత ఏర్పడే సంస్థలో తనకు ఎంత వాటా ఇస్తారని టాటాలను సింగపూర్ ఎయిర్‌లైన్స్ కోరినట్లు తెలుస్తోంది. దీనిపై రెండు కంపెనీల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే… విలీన ప్రక్రియ పూర్తవుతుంది. ఒకవేళ అన్నీ కుదిరితే 2023 చివరికల్లా ఈ విలీన ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది.