నిఫ్టికి భారీ లాభాలు… షేర్లకు నష్టాలు
ఇవాళ ఈక్విటీ మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది. నిఫ్టి ఏకంగా 328 పాయింట్ల లాభంతో 18356 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1181 పాయింట్ల లాభంతో క్లోజైంది. ఇక బ్యాంక్ నిఫ్టి కొత్త ఆల్ టైమ్ హై 42144 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాళ్టి ట్రేడింగ్ ధోరణి చూస్తే… సూచీలను పైకి తీసుకెళ్ళేందుకు కేవలం సూచీ ఆధారిత షేర్లలోనే అధిక ట్రేడింగ్ జరిగినట్లు కన్పిస్తోంది. ఇండెక్స్ ప్రధాన షేర్లు భారీ లాభాలతో క్లోజ్ కాగా… అనేక షేర్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. మంచి ఫలితాలు ప్రకటించిన షేర్లు కూడా భారీ నష్టపోయాయి. నిఫ్టి 1.82 శాతం లాభంతో క్లోజ్ కాగా … నిఫ్టి మిడ్ క్యాప్ షేర్ల సూచీ 0.17 శాతం నష్టంతో ముగిసిందంటే… పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాగే నిఫ్టి నెక్ట్స్ లాభాలు కూడా ఒక శాతం లోపే. చూస్తుంటే పైస్థాయిలో పెద్ద ఇన్వెస్టర్లు బయటపడినట్లు కనిపిస్తోంది.అనేక షేర్లలో అధిక స్థాయిల వద్ద లాభాల స్వీకరణ కన్పించింది. ఇండియన్ హోటల్స్ వంటి అద్భుత పనితీరు కనబర్చిన షేర్ కూడా రూ. 23 నష్టంతో ముగిశాయి. అలాగే అనేక షేర్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. బ్యాంక్ షేర్లలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆరు శాతం దాకా పెరగ్గా, బంధన్ బ్యాంక్ 1.7 శాతం లాభపడింది. ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ బరోడా రెండు శాతం నష్టపోయాయి. మిగిలిన షేర్లలో ఊపు లేదు.