స్థిరంగా కొనసాగుతున్న నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నా నిఫ్టి మాత్రం స్థిరంగా ఉంటోంది. ఆరంభంలో 18000 దిగుకు వెళ్ళినా… తరవాత కోలుకుని గ్రీన్కి వచ్చింది. యూరో మార్కెట్లకు ముందు లాభాల్లోకి వచ్చి 18106ని తాకిన నిఫ్టి ఇపుడు 18036 పాయింట్ల వద్ద 47 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టి ఇవాళ నిఫ్టిని ఆదుకుంటోంది. నిఫ్టి బ్యాంక్ 0.6 శాతం లాభంతో ఉంది. కాని మెటల్స్, ఐటీ షేర్లు నిఫ్టిని దెబ్బతీస్తున్నాయి. వడ్డీ రేట్లను వరుసగా పెంచుతూ పోవడం వల్ల ఈక్విటీ మార్కెట్లు పడుతున్నా… వెంటనే కోలుకుంటున్నాయి. అయితే ఇదెంతో కాలం కొనసాగదని.. మాంద్యం ప్రభావం వచ్చే ఏడాది కచ్చితంగా ఉంటుంది ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే మన మార్కెట్లో లిక్విడిటీ పుష్కలంగా ఉంది. మున్ముందు పెరుగుతుందనే ఆశతో చాలా మంది పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు. దీంతో సూచీలు గ్రీన్లో ఉన్నాయి. ఇది ఎంతకాలం అన్నది చూడాలి. ఇవాళ్టికి మాత్రం నిఫ్టి స్థిరంగా లేదా స్వల్ప నష్టాలతో ముగిసే అవకాశముంది. ఎందుకంటే అమెరికా ఫ్యూచర్స్ బలహీనంగా ఉన్నాయి. ఏక్షణమైనా నష్టాల్లోకి జారుకోవచ్చు. యూరప్ కూడా అర శాతంపైగా నష్టంతో ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్ రెడ్లోకి మారితే.. యూరో మార్కెట్ నష్టాలు పెరిగే అవకాశముంది.