For Money

Business News

ఎల్‌ఐసీ నుంచి బోనస్‌ షేర్లు?

పబ్లిక్‌ ఇష్యూ ధర నుంచి ఏకంగా 35 శాతం క్షీణించడంతో లబోదిబో అంటున్నారు ఎల్‌ఐసీ షేర్‌ హోల్డర్లు. వీరిని ఆదుకునేందుకు ఎల్‌ఐసీ నడుం బిగించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి గాను కంపెనీలో ఖాళీగా పడి ఉన్న నాన్‌ పార్టిసిపేటింగ్‌ ఫండ్‌ నుంచి రూ. 1.80 లక్షల కోట్లను కంపెనీ షేర్‌ హోల్డర్ల ఫండ్‌కు బదిలీ చేయాలని ఎల్‌ఐసీ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ వర్గాలను పేర్కొంటూ రాయిటర్స్‌ వార్తా సంస్థ ఓ కథనం రాసింది. ప్రస్తుతం ఎల్‌ఐసీ వద్ద నాన్‌ పార్టిసిపేటింగ్‌ ఫండ్‌ కింద రూ. 11.57 లక్షల కోట్ల నిదులు ఉన్నాయి. ఇందులో ఆరో వంతు మొత్తాన్ని ఇన్వెస్టర్లను ఆదుకునేందుకు ఉపయోగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎల్‌ఐసీ రెండు రకాల పాలసీలను అమ్ముతుంది. ఒకటి పార్టిసిపేటింగ్‌ పాలసీలు. ఇందులో వచ్చిన లాభాలను పాలసీదారులతో పంచుకుంటుంది. రెండోది నాన్‌ పార్టిసిపేటింగ్‌ పాలసీలు. వీటినే నాన్‌ పార్‌ పాలసీలు అంటారు. వీటిలో నిర్ణీత ప్రతిఫలాన్ని ఇస్తుంది. అంటే ఈ పాలసీ వల్ల పాలసీదారులకు ఇచ్చిన హామి మొత్తం ఇస్తుంది. ఒకవేళ ఆ పాలసీ మొత్తం ఇంకా అధిక మొత్తాన్ని సంపాదిస్తే…ఆ ప్రీమియంను ఈ నాన్‌ పార్టిసిపేటరీ ఫండ్‌కు బదిలీ చేస్తుంది. ఇలా బదిలీ చేసిన మొత్తం ఇపుడు ఎల్‌ఐసీ వద్ద రూ.11.57 లక్షల కోట్లు ఉంది. ఇందులో నుంచి బదిలీ చేసే మొత్తాన్ని అధిక డివిడెండ్‌ ఇవ్వడమా లేదా బోనస్‌ షేర్లను జారీ చేయడమా అన్న ఎల్‌ఐసీ బోర్డు నిర్ణయిస్తుంది. ఇది వెంటనే ఉండకపోవచ్చు. అయితే షేర్‌ హోల్డర్స్‌ ఫండ్స్‌కు నిధులు బదిలీ చేస్తే ఆటోమేటిగ్గా కంపెనీ నెట్‌వర్త్‌ పెరుగుతుంది.దీంతో నెట్‌వర్త్‌ విషయంలో ఎస్‌బీఐ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ను దాటి నంబర్‌ వన్‌ అవుతుంది. ఒక్కో షేర్‌ను ఎల్‌ఐసీ రూ. 949లకు జారీ చేయగా ఇపుడు రూ. 600 వద్ద షేర్‌ ట్రేడవుతోంది.