అమ్మకాలే…అమ్మకాలు
లాభాల స్వీకరణ ఉదయం, మిడ్ సెషన్ తరవాత అమ్మకాల ఒత్తిడి… వెరశి నిఫ్టి 17000 దిగువకు వచ్చేసింది. ఒకదశలో 16950ని తాకిన నిఫ్టి క్లోజింగ్‌లో 16983కి చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 257 పాయింట్లు క్షీణించింది. బ్యాంక్ షేర్లలో కూడా ఒత్తిడి అధికంగా ఉన్నా… ఎక్కువ ఒత్తిడి మాత్రం నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్ క్యాప్ షేర్లలో కన్పించింది. మిడ్‌సెషన్‌లో కాస్త కోలుకున్నట్లు కన్పించిన నిఫ్టిపై …రెండు గంటల తరవాత భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. చూస్తుంటే.. విదేశీ ఇన్వెస్టర్లు ఇవాళ కూడా భారీగా అమ్మకాలు జరిపారు. ఇన్నాళ్ళు మార్కెట్‌కు దన్నుగా రీటైల్ ఇన్వెస్టర్లు కూడా అలసిపోతున్నారు. యాక్సిస్ బ్యాంక్, అదానీ ఎంటర్‌ప్రైజస్, ఏషియన్ పెయింట్స్ మినహా మిగిలిన నిఫ్టి షేర్లన్నీ నష్టాల్లో ముగిశాయి. దివీస్ ల్యాబ్ ఏకంగా 5 శాతంపైగా నష్టపోయింది. మూడు నెలల క్రితం ఫలితాల తరవాత ఈ షేర్ దాదాపు రూ.1000 క్షీణించి రూ.3365ను తాకింది. ఇవాళ రూ. 3490ని తాకి రూ.3500 వద్ద ముగిసింది. నిఫ్టిలో పలు బ్లూచిప్ షేర్లు మూడు శాతంపైగా నష్టపోయాయి.ఇక నిఫ్టి నెక్ట్స్‌లో మెక్‌డొవెల్, జొమాటొ, హావెల్స్, అంబుజా సిమెంట్,వేదాంత షేర్లు 4 శాతం నుంచి 5 శాతం వరకు క్షీణించాయి. ఇక మిడ్ క్యాప్‌లో అరవిందో ఫార్మా 5 శాతం తగ్గింది. నిఫ్టి బ్యాంక్‌లో ఇండస్ ఇండ్ బ్యాంక్ 3.76 శాతం క్షీణించింది. టీసీఎస్ ఆర్థిక ఫలితాలతో ఈ రంగం కోలుకుంటుందని ఆశించిన ఇన్వెస్టర్లకు నిరాశే మిగిలింది.