టీసీఎస్ కొనాలా? అమ్మాలా?
సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి టీసీఎస్ కంపెనీ ఫలితాలు ప్రకటించింది. మార్జిన్ విషయంలో మార్కెట్ అంచనాలను మించిన ఈ కంపెనీ పనితీరుపై అనేక బ్రోకింగ్ కంపెనీలు తమ విశ్లేషణను అందిస్తూ రెకమెండేషన్లు ఇచ్చాయి. చాలా వరకు బ్రోకింగ్ సంస్థలు కంపెనీ పనితీరు మున్ముందు బాగుంటుందని అంటున్నారు. షేర్ ధర టార్గెట్‌ను పెంచాయి.అయితే సిటీ బ్యాంక్ మాత్రం టీసీఎస్ షేర్‌ను అమ్మమని సలహా ఇచ్చింది. ఈ బ్రోకింగ్ సంస్థ టీసీఎస్ టార్గెట్‌ను రూ.2900గా పేర్కొంది. కంపెనీ పనితీరు బాగున్నా… స్థూలంగా ఐటీ రంగానికి పరిస్థితులు అనుకూలంగా లేవని సిటీ అంటోంది. డాలర్‌తో రూపాయి విలువ పడిపోవడం కంపెనీకి కాస్త అనుకూలంగా ఉన్నా… కంపెనీ భవిష్యత్తు పనితీరుపై యాజమాన్యం ఇచ్చిన అంచనాలు మిశ్రమంగా ఉన్నాయని సిటీ పేర్కొంది. అయితే సీఎల్ఎస్ఏ మాత్రం టీసీఎస్ ఫలితాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉన్నట్లు పేర్కొంది. దీర్ఘకాలిక డిమాండ్ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొంది. కంపెనీ షేర్ టార్గెట్‌ను రూ. 3450గా సీఎల్ఏస్ పేర్కొంది. (ప్రస్తుతం ఈ కంపెనీ షేర్ ఎన్ఎస్ఈలో రూ. 3124 వద్ద ట్రేడవుతోంది. బెర్నెస్టయిన్ బ్రోకింగ్ సంస్థ కూడా కంపెనీ ఫలితాల పట్ల సానుకూలంగా స్పందిస్తూ కంపనీ షేర్ టార్గెట్‌ను రూ. 3850గా పేర్కొంది. అదే మక్వెరీ ఈ షేర్‌పై చాలా బుల్లిష్‌గా ఉంది. మార్జిన్స్ మరింత పెరుగాయన్న కంపెనీ అంచనా చాలా పాజిటివ్ అంశమని ఈ సంస్థ పేర్కొంది. కొత్తగా ఉద్యోగులను తీసుకోవడం తగ్గినా… కంపెనీ భవిష్యత్తులో బాగా రాణిస్తుందని పేర్కొంది. షేర్ టార్గెట్ ధరను రూ. 4150గా పేర్కొంది.