For Money

Business News

టి. సుబ్సరామి రెడ్డి కంపెనీ దివాలా

ప్రముఖ పారిశ్రామిక వేత్త టి సుబ్బరామిరెడ్డి కుటంబానికి చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్‌ కంపెనీ దివాలా తీసింది. కంపెనీ తీసుకున్న రుణాలు చెల్లించడం విఫలమైందని కెనరా బ్యాంక్‌ తాజాగా ఎన్‌సీఎల్‌టీలో దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది. సుబ్బరామిరెడ్డి భార్య ఇందిరా రెడ్డి, కుమారుడు సందీప్‌ రెడ్డి ఈ కంపెనీ డైరెక్టర్లు, యజమానులుగా ఉన్నారు. ఈ కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో లిస్టయింది కూడా. కెనరా బ్యాంక్‌ కన్సార్టియం ద్వారా వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న గాయత్రి ప్రాజెక్ట్స్‌ రూ.6,000 కోట్లకు పైగా రుణాలు తీసుకంది. ఈ రుణాల వసూలు కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీపై బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌లో పిటిషన్‌ వేయగా, ఇప్పుడు కెనరా బ్యాంక్‌ ఆశ్రయించింది. గతంలో కంపెనీ తీసుకున్న రుణాలకు సంబంధించి 2015లో ప్రతిపాదిత రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళిక కుదిరింది. కాని దాని అనుగుణంగా కూడా కంపెనీ చెల్లింపులు చేయడంలో విఫలమైంది. దీంతో బ్యాంకులు దివాలా పిటీషన్‌ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ ఈ నెల 10న జరుగుతుంది.
కంపెనీ తామిచ్చిన రుణాల్ని నకిలీ సబ్‌కాంట్రాక్టర్లకు చెల్లింపులుగా మళ్లించిందని, ఆయా కాంట్రాక్టులు రద్దయినా ఈ మొత్తాన్ని రికవరీ చేయలేదంటూ కొన్ని బ్యాంక్‌లు ఆరోపించాయి. అయితే బ్యాంక్‌లు చేపట్టిన చర్యల్ని నిలుపుచేయాలంటూ తెలంగాణ హైకోర్టులో గాయత్రి ప్రాజెక్ట్స్‌ ఒక రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. హైకోర్టులో ఈ అంశమై తదుపరి విచారణ అక్టోబర్‌ 11న జరగనుంది. గాయత్రి ప్రాజెక్ట్స్‌ తీసుకున్న మొత్తం రుణంలో దాదాపు 30 శాతం బీవోబీ, కెనరా బ్యాంక్‌లు ఇవ్వగా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఫెడరల్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌లు కన్సార్టియంలో ఉన్నాయి. స్టాక్‌ మార్కెట్‌లో ఈ షేర్‌ నిన్న పది శాతం లాభంతో రూ. 10.80 వద్ద ముగియడం విశేషం.