దసపల్లా భూములు.. 70 శాతం డెవలపర్‌కే…
దసపల్లా భూముల వ్యవహారంలో రోజుకో కొత్త వ్యవహారం బయటకు వస్తోంది. వివాదాస్పద భూములకు సంబంధించిన పత్రాలు ప్రభుత్వ శాఖల్లో జెట్ స్పీడుతో కదలుతుండగా… ఎంపీ విజయసాయి అల్లుడు రోహిత్ రెడ్డికి చెందిన కంపెనీ ఆర్థిక మద్దతుతో నడుస్తున్న బినామీ కంపెనీ (ఎష్యూర్ ఎస్టేట్స్ డెవలపర్స్) ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వివాదాస్పద భూ యజమానులతో డెవలపర్ అయిన ఎష్యూర్ ఎస్టేట్స్ డెవలపర్స్ చేసుకున్న ఒప్పందం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. అత్యంత ఖరీదైన ఈ భూముల వ్యవహారంలో…. డెవలపర్ అగ్రిమెంట్ ఎష్యూర్ డెవలపర్స్‌కు అనుకూలంగా ఉండటం విశేషం. దసపల్లా భూముల్లో ఖరీదైన రెసిడెన్షియల్, కమర్షియల్ టవర్ల నిర్మాణానికి ఎష్యూర్ ఎస్టేట్స్ డెవలపర్స్ ఎల్‌ఎల్‌పీ అనే సంస్థ. ఆ స్థలాల యజమానులుగా చెలామణీ అవుతున్న 64 మందితో చేసుకున్న డెవలప్‌మెంట్ ఒప్పందం వివరాలు ఇపుడు మీడియాలో దర్శనమిచ్చాయి. అత్యంత ఖరీదైన ఈ ప్రాంతంలో 15 ఎకరాల భూమిలో ఎష్యూర్ ఎస్టేట్స్ గేటెడ్ కమ్యూనిటీ వంటి నిర్మాణాలు చేపడుతోంది. సాధారణంగా ఇలాంటి చోట స్థల యజమానులకు, డెవలపర్‌కు మధ్య జరిగే ఒప్పందంలో వాటా చెరో 50 శాతం ఉంటుంది. కొన్ని చోట్ల భూయజమానికే ఇంకా ఎక్కువ అంటే 60 శాతం వాటా, డెవలపర్‌కు 40 శాతం వాటా ఉంటుంది. అయితే ఈ వ్యవహారంలో సీన్ రివర్స్. విలువైన దసపల్లా భూముల ఒప్పందంలో .. డెవలపర్ 70 శాతం కంటే ఎక్కువ వాటా దక్కుతుండగా, భూ యజమానులుగా చలామణి అవుతున్నవారికి కేవలం 30 శాతం కంటే తక్కువ ఇవ్వడంతోనే ఇందులో ఉన్న తిరకాసు ఏమిటో అర్థమైతోంది. దసపల్లా భూముల్లో షెడ్యూల్ – ఎ , షెడ్యూల్ బీలో భూములు ఉన్నాయి. ఇందులో షెడ్యూల్ ఏ విషయానికొస్తే భూమి యజమానులకు బిల్టప్ ఏరియాలో 5,98,122 చదరపు అడుగుల స్థలం ఇస్తూ… డెవలపర్‌కు 14,84,877 చదరపు అడుగుల స్థలం తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. ఇక షెడ్యూల్ బి విషయానికొస్తే భూ యజమానులకు 1,98,457 చదరపు అడుగులు ఇస్తారు. మిగిలిన 4,73,542 అడుగుల చదరపు అడుగుల స్థలం డెవలపర్ తీసుకుంటారు. అంటే షెడ్యూల్ ఏ, బీ కలిపితే… మొత్తం 27.55 లక్షల చదరపు అడుగుల్లో భవనాలు నిర్మిస్తారు. ఇందులో 7,96,580 చదరపు అడుగులు స్థల యజమానులుగా చలామణి అవుతున్నవారికి ఇస్తారు. మిగతా 19,58,420 చదరపు అడుగులు డెవలపర్ తీసుకుంటారు. అంటే ఇక్కడ స్థలాల యజమానులకు దక్కేది బిల్టప్ ఏరియాలో కేవలం 29 శాతమే. డెవలపర్‌కు 71 శాతం దక్కనుంది. ఈ నిష్పత్తి ఫైనల్. మున్ముందు ఎంత స్థలం మేరకు అధికారిక అనుమతులు వస్తాయో వాటిని… ఈ నిష్పత్తి మేరకు పంచుకోవవాల్సి ఉంటుంది. నిర్మించబోయే గెటెడ్ కమ్యూనిటీలో తమ వంతు భాగంగా వచ్చే అవిభాజ్య భూమి మినహా… మిగిలిన భూమి హక్కులను ఎష్యూర్ ఎస్టేట్‌కు లేదా ఆ కంపెనీ నామినేట్ చేసేవారికి (అంటే విజయాసాయి రెడ్డి అల్లుడు అని అనుకోవచ్చు) పైసా అదనపు సొమ్ము కాని.. ఇంకేదైనా కోరకుండా బదిలీ అంటే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. డెవలపర్ సంస్థ లేదా ఆ సంస్థ నామినేట్ చేసే వ్యక్తులు, సంస్థల పేరున డాక్యుమెంట్లను భూ యజమానులు రిజిస్టర్ చేయించి ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఖర్చులు డెవలపర్ భరిస్తారని అగ్రిమెంట్‌లో పేర్కొన్నారు. మొత్తం ప్రాజెక్టు 48 నెలల్లో పూర్తి చేస్తామని డెవలపర్ అగ్రిమెంట్‌లో పేర్కొన్నారు. ఈ అగ్రిమెంట్‌లో మరో చిత్రమేమిటంటే… ఇంత ఖరీదైన స్థలంలో నిర్మాణాలకు తమకు హక్కులు ఇచ్చినందుకు ‘గుడ్‌విల్’ కింద ఒక్కొక్కరికి రూ .50 వేలు ఇచ్చేందుకు డెవలపర్స్ అంగీకరించడం. అంటే 64 మందికి ఇచ్చే మొత్తం రూ .32 లక్షలన్న మాట! ఈ భూముల వ్యవహారంలో ఇప్పటి వరకు దాదాపు రూ.10 కోట్లు చేతులు మారగా…ఈ మొత్తం అంతా విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి అల్లుడికి చెందిన ఎల్ఎల్‌పీ నుంచే వచ్చాయని విపక్షాలు సంబంధిత డాక్యుమెంట్లను బయట పెట్టిన విషయం తెలిసిందే. ఈ ఎల్‌ఎల్‌పీలో ఇద్దరు భాగస్వాములు కాగా ఒకరు రోహిత్ రెడ్డి.. మరొకరు ఆయన భార్య నేహా రెడ్డి అంటే విజయసాయి రెడ్డి కుమార్తె. దసపల్లా భూముల విషయంలో విజయసాయి రెడ్డి స్పందిస్తూ జారీ చేస్తున్న పత్రికా ప్రకటనల్లో తన అల్లుడు కంపెనీ పాత్రపై నోరు మెదకపోవడం విశేషం.