For Money

Business News

కుప్పకూలిన నిఫ్టి

మిడ్‌సెషన్‌లో ఊహించినట్లే నిఫ్టి 17000 స్థాయి పైన నిలబడ లేకపోయింది. అంతర్జాతీయ ఈక్వీటీ మార్కెట్లు నష్టాల్లో ఉండటం, క్రూడ్‌ ధరలు మళ్ళీ 90 డాలర్ల వైపు పరుగులు పెడుతుండటంతో మళ్ళీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఉదయం ఊహించినట్లే అధిక స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడి వచ్చింది. నిజానికి సింగపూర్ నిఫ్టి ఇవాళ తెల్లవారు జామున ట్రేడైన స్థాయికి నిఫ్టి పడిపోయింది. ఉదయం నిఫ్టి పడి… 17000 ప్రాంతానికి చేరుతుందని అంచనా వేశారు. కాకపోతే రివర్స్‌ జరిగింది. ప్రారంభంలో అధిక స్థాయికి చేరి అక్కడి నుంచి కరగడం ప్రారంభమైంది. యూరప్‌పై ఆశలతో మిడ్‌ సెషన్‌లో కాస్త పెరిగినా… తరవాత స్పీడుగా పతనం సాగింది. ఒకదశలో 16855 స్థాయిని తాకిన నిఫ్టి క్లోజింగ్‌లో 16887 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 207 పాయింట్లు క్షీణించింది. సెన్సెక్స్‌ 638 పాయింట్లు తగ్గింది.ఫార్మా, కొన్ని ఆయిల్‌ షేర్లు మినహా పలు కీలక రంగాల షేర్లలో లాభాల స్వీకరణ జోరుగా సాగింది.నిఫ్టి నెక్ట్స్‌ సూచీ ఇవాళ 2 శాతంపైగా క్షీణించింది. అదానీ గ్రూప్‌ షేర్లలో భారీ ఒత్తిడి కన్పించింది. నిఫ్టిలో 39 షేర్లు నష్టాల్లో ముగిశాయి. దాదాపు అన్ని సూచీలు 1.5 శాతం క్షీణించడం విశేషం. అరబిందో ఫార్మా 4శాతంపైగా లాభంతో ముగిసింది. డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా కూడా ఆకర్షణీయంగా లాభపడ్డాయి.