భారీగా లాభాల స్వీకరణ
పాపం… ఇన్వెస్టర్లకు మార్కెట్ ఓ ఛాన్స్ ఇచ్చింది.. బయటపడేందుకు. విననివారికి గట్టి షాక్ ఇచ్చింది. యూరో మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభం కావడంతో ఇవాళ్టి కనిష్ఠ స్థాయిని నిఫ్టి బాగా కోలుకుంది. మిడ్ సెషన్లో కాస్త హెచ్చుతగ్గులకు లోనైంది. పెరిగిన ప్రతిసారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. చివర్లో రెండు గంటలకు ప్రారంభమైన పతనం చివర్లో నిఫ్టిని 17000 దిగువకు తీసుకెళ్ళింది. చివరల్లో 17016 వద్ద ముగిసింది. వెరశి క్రితం ముగింపుతో పోలిస్తే 311 పాయింట్ల భారీ నష్టంతో ముగిసింది. గత శుక్రవారం భారీగా క్షీణించిన వాల్‌స్ట్రీట్… ఇవాళ లాభాల్లో ప్రారంభమౌతుందేమోనన్న ఆశ మిడ్ సెషన్లో కలిగింది. ఫ్యూచర్స్ సూచీలు భారీ నష్టాల నుంచి గ్రీన్‌లో వచ్చే సరికి చాలా మంది ధీమాగా ఉన్నారు. కాని ఆ సూచీలు మళ్ళీ అర శాతం పైగా నష్టాల్లోకి జారుకోవడంతో మన ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఏవో కొన్ని షేర్లు మినహా మెజారిటీ షేర్లు భారీగా నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లకు మాత్రమే మద్దతు లభించింది. అలాగే కొన్ని ఫార్మా కౌంటర్లకు. డాలర్‌తో రూపాయి క్షీణించడం ఐటీ కంపెనీలకు పాజిటివ్ అంశం. కాని అమెరికా మాంద్యంలోకి వెళితే ఈ షేర్లు ప్రస్తుత స్థాయిలో నిలబడతాయా అన్నది చూడాలి. ఇక ఇతర సూచీల సంగతి చూస్తే… నిఫ్టి మిడ్ క్యాప్ సూచీ మూడు శాతంపైగా నష్టపోయింది. అలాగే నిఫ్టినెక్ట్స్ 2.72 శాతం, నిఫ్టి బ్యాంక్ 2.35 శాతం చొప్పున నష్టపోయాయి. చాలా రోజుల తరవాత అదానీ గ్రూప్ షేర్లలో ఒత్తిడి కన్పిస్తోంది. రియల్ ఎస్టేట్ షేర్లలో కూడా లాభాలను స్వీకరించారు.