దిగువ స్థాయిలో కోలుకున్నా…
నిఫ్టికి ఊహించినట్లే 17000 దిగువన మద్దతు అందింది. 16,978 పాయింట్లకు క్షీణించిన నిఫ్టి అక్కడి నుంచి కోలుకుని 17153 పాయింట్లకు చేరింది. మిడ్ సెషన్లో మొదలైన యూరో మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా ఫ్యూచర్స్ భారీ నష్టాల నుంచి కోలుకుని లాభాల్లోకి వచ్చాయి. యూరో స్టాక్స్ 50 సూచీ 0.4 శాతం లాభంతో ఉఏంది. అయితే నిఫ్టి మాత్రం 190 పాయింట్ల నష్టంతో 17137 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ వారంలో నెలవారీ, మంత్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉన్నందున… నిఫ్టి తీవ్ర హెచ్చు తగ్గులకు లోనయ్యే అవకాశముంది. మరి అమెరికా, యూరప్ మార్కెట్లకు స్పందిస్తూ గ్రీన్‌లోకి వస్తుందా లేదా నష్టాలతో ముగుస్తుందా అన్నది చూడాలి. ఇవాళ ఐటీ షేర్లతో పాటు ఫార్మా షేర్లు నిఫ్టికి అండగా ఉన్నాయి. డాలర్‌తో రూపాయి పతనం ఈ రెండు రంగాల కంపెనీలకు పాజిటివ్ అంశం. అలాగే క్రూడ్ ధరలు తగ్గడం వల్ల పెయింట్ కంపెనీలు కూడా బాగా లబ్ది పొందనున్నాయి. ఏషియన్ పెయింట్స్ అందుకే నిఫ్టి టాప్ 5 గెయినర్స్‌లో ఉంది. ఒక దశలో 8 శాతం దాకా నష్టపోయిన పవర్‌గ్రిడ్ కోలుకుంది. ఇపుడు టాటా మోటార్స్ 5 శాతం నష్టంతో నిఫ్టి టాప్ లూజర్‌గా నిలిచింది. అదానీ గ్రీన్ 4 శాతం నష్టంతో ఉంది. నిఫ్టి బ్యాంక్ ఇప్పటికీ 1.6 శాతం నష్టంతో ఉండటం గమనార్హం. అలాగే నిఫ్టి మిడ్‌క్యాప్ సూచీ రెండు శాతంపైగా నష్టపోయింది. మొత్తానికి మన మార్కెట్లు చాలా బలహీనంగా ఉన్నాయి.