చివరి క్షణం వరకు జీవించారు…
ఎక్కువ రోజులు బతకడం కాదు. బతికినన్ని రోజులు గొప్పగా జీవించాలి- ఈ ఫిలాసఫీని బాగా నమ్మేవారు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా. ఇవాళ ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. ”డబ్బులు సంపాదించడం వల్ల నాకిష్టమైన పద్ధతిలో నేను జీవిస్తున్నాను. నాకిష్టమైన తిండి నేను తింటున్నాను. అంతకుమించి ఆ డబ్బు వల్ల వచ్చే ప్రయోజనం లేద”నే రాకేష్ రోజుకు 25 సిగరెట్లు తాగేవాడు. ”ఆరు పెగ్గుల విస్కీ తాగి.. పందిలా తినే నేను వ్యాయామం కూడా చేయను. మరి నా జీవిత కాలం తక్కువే ఉంటుంద”ని అనే వాడు. తన రెండు కిడ్నీలు పాడైనా సరే.. డయాలిసిస్ చేసుకుంటూ కొత్త విమానయాన కంపెనీ పెట్టారు. అనేక కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన రాకేష్ సొంతంగా ఓ కంపెనీ పెట్టడం ఇదే మొదటిసారి. కాని ఆ కంపెనీ ప్రారంభమై నెల రోజులు కాకుండానే మృతి చెందారు. అయితే ఆయన జీవితం చివరి క్షణం వరకు చాలా ఆనందంగా జీవించారని ఆయన సన్నిహితులు అంటున్నారు. మోతీలాల్ ఓస్వాల్ సంస్థ అధినేత రామ్‌దేవ్ నుంచి క్లాస్మేట్ ఉదయ్ కొటక్ వరకు.. అందరూ రాకేష్ ఉత్సాహాన్ని చూసి తెగ ముచ్చటపడేవారు. అంతటి తీవ్ర అనారోగ్యంలోనూ కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో పూర్తి స్థాయిలో ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశారు రాకేష్. బంటీ ఔర్ బబ్లి సినిమాలోని గజరారే పాటకు వీల్ ఛైర్లో కూర్చొనే డ్యాన్స్ చేసిన దృశ్యాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకస్థాయికి మించిన తరవాత డబ్బు వల్ల మనకెలాంటి ఆనందం ఉండదని అంటారు రాకేష్. రోజూ రొటీన్‌గా పనిచేయాలి కాబట్టి… పనిలో భాగంగా డబ్బు సంపాదిస్తామని అన్నారు. డబ్బులు ఉన్నాయి కదా అని వారం రోజులు ఇంట్లో ఉంటే… ‘ఏంటీ ఆఫీసుకు వెళ్ళలేద’ని భార్య అంటుందనీ, తనది మిడిల్ క్లాస్ మెంటాలిటీ అని.. ఎపుడూ పది రూపాయాలు సంపాదించాలనే యావ తప్ప… వచ్చిన సంపాదనతో తృప్తి ఉండదని అన్నారు.
"बाबू मोशाय!! जिंदगी बड़ी होनी चाहिए, लंबी नहीं।"#Rakeshjhunjhunwala pic.twitter.com/9r4pRRFf1f
— Akhilesh Sharma (@akhileshsharma1) August 14, 2022