మైక్రోసాఫ్ట్ షాపింగ్ యాప్ వచ్చేస్తోంది!
భారత ప్రభుత్వానికి చెందిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ONDC) ప్లాట్‌ఫామ్‌తో మైక్రోసాఫ్ట్ జత కట్టింది. ఈ భాగస్వామ్యంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ సోషల్ ఈ-కామర్స్ వ్యాపారాల్లోకి ప్రవేశిస్తోంది. ONDC ప్లాట్‌ఫామ్‌తో జతకట్టిన తొలి అతిపెద్ద టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ కావడం విశేషం. త్వరలోనే మైక్రోసాఫ్ట్ షాపింగ్ యాప్‌ను కూడా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. భారత్‌లో ఈ-కామర్స్ మార్కెట్ అనూహ్య స్థాయిలో పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా తర్వాత ఈ మార్కెట్ జెట్ స్పీడ్‌తో పెరుగుతోంది. భారత ఈ-కామర్స్ రంగం వార్షిక వృద్ధి రేటు 19.24 శాతం కాగా, 2025 నాటికి ఈ మార్కెట్ విలువ 11,140 కోట్ల డాలర్లకు చేరుకుంటుందని ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ అంచనావేస్తోంది. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈ మార్కెట్లోకి వస్తే… కంపెనీల మధ్య మరింత పోటీ పెరగే అవకాశముంది. దీంతో డిస్కౌంట్ల మోత భారీగానే ఉంటుందని తెలుస్తోంది.